లోన్‌ యాప్‌ వేధింపులు తాళలేక యువకుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

లోన్‌ యాప్‌ వేధింపులు తాళలేక యువకుడి ఆత్మహత్య

Apr 24 2026 6:26 AM | Updated on Apr 24 2026 6:26 AM

మడకశిర రూరల్‌: లోన్‌ యాప్‌ నిర్వాహకుల వేధింపులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు... శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం ఉప్పిడిపల్లికి చెందిన సిద్దార్థ (24)కు అదే గ్రామానికి చెందిన ఓ యువతితో వివాహమైంది. వీరికి రెండేళ్ల వయసున్న కుమార్తె ఉంది. ఈ క్రమంలో సిద్దార్థ వ్యక్తిగత అవసరాల నిమిత్తం ‘సీఏఎస్‌ఈఏఎస్‌’ యాప్‌ ద్వారా రూ.10 వేల రుణం తీసుకున్నాడు. రుణం తీసుకునే ముందు యాప్‌లో ఉన్న సమాచారం మేరకు తనకు పరిచయస్తులైన నలుగురి ఫోన్‌ నంబర్లను నమోదు చేశాడు. అయితే రుణం కంతులు సక్రమంగా చెల్లించలేకపోవడంతో వడ్డీల భారం పెరిగి రూ.16 వేలకు చేరుకుంది. ఈ క్రమంలో యాప్‌ నిర్వాహకుల నుంచి వేధింపులు మొదలయ్యాయి. రుణం చెల్లించకపోతే నగ్నంగా ఉన్న ఫొటోలను షేర్‌ చేసి పరువు తీస్తామంటూ బెదిరింపులకు దిగారు. దీంతో తనకు కొద్ది సమయం కావాలని సిద్ధార్థ కోరాడు. అయినా వినకుండా లోన్‌ యాప్‌ నిర్వాహకులు గతంలో సిద్దార్థ నమోదు చేసిన పరిచయస్తుల సెల్‌ఫోన్ల వాట్సాప్‌ నంబర్లకు నగ్నంగా ఉన్న ఫొటోలు పంపారు. వారి ద్వారా విషయం తెలుసుకున్న సిద్దార్థ తీవ్ర మనోవేదనకు లోనై ఈ నెల 21న కనిపించకుండా పోయాడు. అప్పటి నుంచి కుటుంబసభ్యులు, బంధుమిత్రులు గాలించినా ఫలితం లేకపోయింది. గురువారం ఉదయం గ్రామ శివారులోని పొలంలో చెట్టుకు వేసుకున్న ఉరికి విగతజీవిగా వేలాడుతున్న సిద్దార్థను గమనించిన స్థానికుల సమాచారంతో కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని బోరున విలపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అవమానం భరించలేక తన భర్త ఆత్మహత్య చేసుకున్నట్లుగా భార్య కవిత చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement