ఆర్టీసీ నిర్మాణాల్లో అలసత్వం | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ నిర్మాణాల్లో అలసత్వం

Apr 24 2026 6:14 AM | Updated on Apr 24 2026 6:14 AM

అధికార పార్టీ నేతల ధన దాహానికి ఆర్టీసీ అభివృద్ధి కుంటు పడింది. అభివృద్ధి పనుల్లో పంపకాలు, పర్సంటేజీల ఒత్తిళ్ల నేపథ్యంలో ఎక్కడి నిర్మాణాలు అక్కడే నిలిచి పోయాయి. టీడీపీ ప్రజాప్రతినిధులు వేసిన శిలాఫలకాలు దిష్టిబొమ్మల్లా మారాయి.

శిలాఫలకాలతోనే సరి

అనంతపురం క్రైం: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్టీసీ అనంతపురం రీజియన్‌ పరిధిలో చేపట్టిన పలు నిర్మాణాలు ప్రారంభ దశలోనే ఆగిపోయాయి. గుత్తి బస్టాండ్‌ నిర్మాణం కోసం రూ.20 లక్షలతో తాత్కాలిక బస్‌ స్టేషన్‌ ఏర్పాటు చేస్తామంటూ ప్రకటించినా నేటికీ పనులు ప్రారంభం కాలేదు. గుత్తి బస్టాండ్‌లో ఆరు దుకాణాల నుంచి ప్రతి నెలా రూ. లక్ష వరకూ అద్దె రూపంలో ఆదాయం సమకూరేది. అభివృద్ధి పేరుతో ఈ దుకాణాలను కూల్చేశారు. తాత్కాలిక బస్టాండు నిర్మాణం తప్పనిసరి అంటూ మార్చి 31న నేతలు శిలాఫలకాలు కూడా వేశారు. అయితే ఈ పనులు నేటికీ ప్రారంభం కాలేదు. కారణాలు ఆరా తీస్తే శాశ్వత బస్టాండ్‌ నిర్మాణం కోసం రూ.5 కోట్ల అంచనాతో ప్రణాళిక సిద్ధమైనా, కాంట్రాక్టర్‌ పనులు చేపడుతున్న సమయంలో స్థానిక టీడీపీ నేతల నుంచి పర్సెంటేజీల కోసం వేధింపులు మొదలయ్యాయి. దీంతో పనులు చేపట్టలేక కాంట్రాక్టర్‌ ముఖం చాటేశాడు.

రాయదుర్గంలోనూ అదే పరిస్థితి

రాయదుర్గంలో బస్టాండ్‌ నిర్మాణానికి వర్క్‌ ఆర్డర్‌ ఉన్నా.. రూ.50 లక్షలతో జరగాల్సిన పనులపై ఎలాంటి పురోగతి లేదు. అలాగే అనంతపురంలో ఆర్టీసీ ఆర్‌ఎం కార్యాలయ నిర్మాణం కూడా నత్తనడకన సాగుతోంది. ఈ పని ఇప్పటి వరకూ కేవలం పిల్లర్లకు కాలమ్స్‌ వేయడం వరకే పరిమితమైంది.

పర్సెంటేజీల గోల

తమకు పర్సెంటేజీలు చెల్లించకపోతే పనులు అడ్డుకుంటామంటూ కాంట్రాక్టర్లను స్థానిక టీడీపీ నేతలు బెదిరిస్తున్నట్లుగా అంతర్గతంగా జోరుగా చర్చ సాగుతోంది. సబ్‌ కాంట్రాక్టుల పంపకాల విషయంగా మితిమీరిన జోక్యం, ఆర్థిక లావాదేవీల్లో స్పష్టత లేకపోవడంతో కాంట్రాక్టర్లు సైతం ధైర్యం చేసి ముందుకు రాలేకపోతున్నారు. ఈ నిర్మాణాలపై అధికారులు కూడా సరైన చర్యలు తీసుకోలేకపోతున్నారు. ప్రధానంగా ఇన్‌చార్జ్‌ల పెత్తనంతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఆర్‌ఎం నుంచి డీఎం వరకూ కీలక స్థానాలన్నీ ఇన్‌చార్జ్‌లతోనే నెట్టుకొస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిపాలన దౌర్బాగ్యంగా మారిందని ఉద్యోగులు వాపోతున్నారు. ప్రతి పనీ వారికి అనుకూలంగా వెళ్లాలనడమే కానీ, ప్రయాణికుల సంక్షేమం, వారి భధ్రతను గాలికి వదిలేశారని వాపోతున్నారు.

ఊహల పల్లకీలో ఊరేగింపు

బాబు సర్కారులో ఆర్టీసీకి పైసా లబ్ధి చేకూరకపోయినా ప్రయాణికులను మాత్రం ఊహల పల్లకీలో ఊరేగిస్తున్నట్టుగా నేతలు ప్రకటనలు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఊకదంపుడు ఉపన్యాసాలతో ప్రజలను మభ్యపెడుతూ, అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ పలువురు మండిపడుతున్నారు. ప్రజలకు అవసరమైన బస్టాండ్లు, కార్యాలయాలు సమయానికి పూర్తి కాకపోవడం వల్ల ఆర్థిక నష్టం మాత్రమే కాక, ఉన్నవాటిని కూల్చేయడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులు అడ్డుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ విషయంపై ఆర్టీసీ ఇన్‌చార్జ్‌ ఆర్‌ఎం శ్రీలక్ష్మిని వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆమె అందుబాటులోకి రాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement