ఆర్‌టీఐహెచ్‌తో ఎస్‌ఆర్‌ఐటీ ఒప్పందం | - | Sakshi
Sakshi News home page

ఆర్‌టీఐహెచ్‌తో ఎస్‌ఆర్‌ఐటీ ఒప్పందం

Apr 24 2026 6:14 AM | Updated on Apr 24 2026 6:14 AM

బుక్కరాయసముద్రం: మండలంలోని రోటరీపురం వద్ద ఉన్న ఎస్‌ఆర్‌ఐటీ (అటానమస్‌) ఇంజినీరింగ్‌ కళాశాలలో ఇంకుబేషన్‌ సెంటర్‌ స్థాపనకు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ సెంటర్‌ (ఆర్‌టీఐహెచ్‌)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ బాలకృష్ణ, వైస్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ రంజిత్‌రెడ్డి తెలిపారు. వివరాలను గురువారం వారు వెల్లడించారు. విద్యార్థుల్లో ఇన్నోవేషన్‌ వ్యాపార దృక్పథాన్ని ప్రోత్సహించడంతో పాటు వ్యాపారవేత్తలుగా ఎదిగాలనుకునే ఔత్సాహిక విద్యార్థులను గుర్తించి వారిలో నైపుణ్యాలు, బిజినెస్‌ స్కిల్స్‌ను అభివృద్ధి చేయడం ప్రధాన లక్ష్యంగా ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వివరించారు. ఈ భాగస్వామ్యం ద్వారా నూతన ఆవిష్కరణలతో పాటు విద్యార్థులకు స్టార్టప్‌లు, ఉపాధి అవకాశాలు విస్తరించనున్నాయన్నారు. కార్యక్రమంలో రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ సెంటర్‌ సీఈఓ డాక్టర్‌ హఫీజ్‌ బాషా, ఐఐసీ అధ్యక్షుడు డాక్టర్‌ రంజిత్‌రెడ్డి, కన్వీనర్‌ డాక్టర్‌ ఆంజనేయులు పాల్గొన్నారు.

మొక్కజొన్న పంట దగ్ధం

గుమ్మఘట్ట: గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు రాజేయడంతో మొక్కజొన్న పంట దగ్ధమైంది. స్థానికులు తెలిపిన మేరకు.. గుమ్మఘట్ట మండలం తాళ్లకెర గ్రామానికి చెందిన రైతు సన్నన్న తనకున్న 4.45 ఎకరాల భూమిలో మొక్కజొన్న పంట సాగు చేశాడు. పంట చేతికి రావడంతో కోత కోసి కంకులను ఓ చోట ఆరబోశాడు. ఈ నేపథ్యంలో గురువారం ఆరుబయలు ప్రాంతంలోని ఎండు గడ్డికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు రాజేయడంతో మంటలు చెలరేగి ఆరబోసిన కంకులను చుట్టుముట్టాయి. కంకులతో పాటు టార్పాలిన్‌, డ్రిప్‌ పరికరాలు కాలి బూడిదయ్యాయి. ఘటనతో రూ.3 లక్షల మేర నష్టం వాటిల్లిందని బాధిత రైతు వాపోయాడు. ప్రభుత్వం స్పందించి బాధిత రైతును ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.

మహిళల భద్రతే ప్రభుత్వ లక్ష్యం : ఎస్పీ

కళ్యాణదుర్గం రూరల్‌: మహిళల భద్రతే ప్రభుత్వ లక్ష్యంగా పోలీస్‌ శాఖ పనిచేస్తోందని ఎస్పీ జగదీష్‌ అన్నారు. సీ్త్ర శక్తి యాప్‌పై గురువారం కళ్యాణదుర్గంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో మహిళలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, పోలీసు సిబ్బందితో కలసి తొలుత పట్టణంలో ఎస్పీ బైక్‌ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన సదస్సులో మాట్లాడారు. సెల్‌ఫోన్‌ ఉన్న ప్రతి ఒక్క మహిళ రస్త్‌రీ శక్తి యాప్‌ను డౌన్‌లోడు చేసుకోవాలన్నారు. ఏవిధమైన ఇబ్బందులు తలెత్తిన సీ్త్ర శక్తి యాప్‌ ఉపయోగించుకుని రక్షణ పొందాలన్నారు. స్వీయ రక్షణ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని బాలబాలికలకు సూచించారు. బాల్య వివాహలను నివారించి మహిళలు ఉన్నతమైన చదువులు చదువుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ రవిబాబు, పోలీసు సిబ్బంది, అంగన్‌వాడీ సిబ్బంది, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

వ్యక్తి దుర్మరణం

శింగనమల: వాహనం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... శింగనమల మండలం సి.బండమీదపల్లి గ్రామానికి చెందిన హరి (34) రాప్తాడు సమీపంలో ఉన్న ఐచర్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. గురువారం వ్యక్తిగత పనిపై ద్విచక్ర వాహనంపై తాడిపత్రికి వెళ్లాడు. అక్కడ పని ముగించుకుని రాత్రి తిరుగు ప్రయాణమైన ఆయన నాయనపల్లిక్రాస్‌ వద్దకు చేరుకోగానే గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఘటనలో తీవ్రంగా గాయపడిన హరి అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, హరికి భార్య, కుమార్తె ఉన్నారు. గతంలో సచివాలయ వలంటీర్‌గా పనిచేసాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఆటో బోల్తా .. వ్యక్తి మృతి

కూడేరు: ఆటో బోల్తా పడన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... కూడేరు మండలం పి.నారాయణపురానికి చెందిన దొనస్వామిరెడ్డి(60) తన చెల్లెలు కుమారుడి పెళ్లి కోసమని బుధవారం కడదరకుంట వద్ద ఓ తోటలో మామిడి కాయలు కొనుగోలు చేసుకుని ఆటోలో వేసుకుని స్వగ్రామానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతో ఆటో అదుపు తప్పి బోల్తాపడింది. ఘటనలో దొనస్వామికి తీవ్ర గాయాలయ్యాయి. స్వల్ప గాయాలతో డ్రైవర్‌ రాజేష్‌ బయటపడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే దొనస్వామిని అనంతపురంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు. మృతునికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement