బూదగవిలో ఉద్రిక్తత | - | Sakshi
Sakshi News home page

బూదగవిలో ఉద్రిక్తత

Apr 24 2026 6:14 AM | Updated on Apr 24 2026 6:14 AM

కోర్టు వివాదంలో ఉన్న భూమిని కొలిచేందుకు వెళ్లిన అధికారులు

మనస్తాపంతో పురుగుల మందు తాగిన యువరైతు

ఉరవకొండ: కోర్టు వివాదంలో ఉన్న భూమిని కొలిచేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధం కావడంతో మనస్తాపంతో ఓ యువరైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వివరాలు... పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు బాధిత కుటుంబసభ్యులు మేరకు ఉరవకొండ మండలం బూదగవి గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ మద్దతు తాజా మాజీ సర్పంచ్‌ లక్ష్మీదేవి పాతికేళ్ల క్రితం సోమశేఖర్‌గౌడ్‌ అనే వ్యక్తితో పాల్తూరు గ్రామ సమీపంలోని సర్వే నంబర్‌ 333ఎ, 313లో ఉన్న 8.64 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. కొంతకాలంగా ఆ భూమిపై కన్నేసిన కృష్ణం రఘుతో పాటు గంట రంగనాథ్‌, గోవిందునాయక్‌, ఎరికల సురేష్‌, నరేంద్ర ఎలాగైనా ఆక్రమించుకోవాలని తీవ్ర ప్రయత్నాలు సాగిస్తూ వచ్చారు. దీంతో లక్ష్మీదేవి కుమారులు మల్లికార్జున, ధనుంజయ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అప్పటి నుంచి ఈ వివాదం ఉరవకొండ సివిల్‌ కోర్టులో నడుస్తోంది. అయినా కృష్ణం రఘు, తదితరులు పట్టించుకోకుండా ఈ నెల 4న భూమిలో దౌర్జన్యంగా ప్రవేశించి కొలతలు తీయడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో మల్లికార్జున కుటుంబసభ్యులు అడ్డుకున్నారు. దీంతో అప్పటికి వెనక్కు తగ్గిన వారు... గురువారం భారీ పోలీసు భద్రత మధ్య రెవెన్యూ అధికారులతో కొలతలు తీయించేందుకు సిద్ధమయ్యారు. దీంతో తీవ్ర మనోవేదనకు లోనైన మల్లికార్జున అధికారుల సమక్షంలోనే పురుగుల మందు తాగడంతో వెంటనే 108 వాహనంలో ఉరవకొండలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురానికి వైద్యులు రెఫర్‌ చేశారు. ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement