అనంతపురం అగ్రికల్చర్: ప్రమాదకర గాలికుంటు వ్యాధి బారిన పశువులు పడకుండా ముందస్తుగా టీకాలు వేయించాలని రైతులకు జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక రెవెన్యూభవన్‌లో పశుశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని పోస్టర్లను విడుదల చేసి, మాట్లాడారు. 2030 నాటికి గాలి కుంటు వ్యాధిని సమూలంగా నివారించే కార్యక్రమంలో భాగంగా జాతీయ జంతు వ్యాధి నియంత్రణ కార్యక్రమం (ఎన్‌ఏడీసీపీ) కింద కేంద్ర ప్రభుత్వం సౌజన్యంతో ఏప్రిల్ 29 వరకు 45 రోజుల పాటు అన్ని రకాల పశువులు, ఎద్దులు, గేదెలు, దూడలకు ఉచితంగా టీకాలు అందజేస్తున్నట్లు వివరించారు. జిల్లా వ్యాప్తంగా 3.20 లక్షల పశువులకు టీకాలు వేయాలనే లక్ష్యంగా నిర్దేశించుకుని గ్రామ గ్రామాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


