గుంతకల్లు రూరల్: కలుషితాహారం తినడం వల్ల పది మంది భక్తులు అస్వస్థతకు గురయ్యారు. బాధితుల కథనం మేరకు.. కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లా మొలకాల్మూరు తాలూకా అశోక సిద్ధాపురం గ్రామానికి చెందిన దాదాపు 45 మంది భక్తులు ఒకే కుటుంబానికి చెందిన వారు ఉగాది ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఈనెల 19న కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో వసతి గదులు దొరక్క పోవడం, బయట అద్దె గదుల ధర భారీగా ఉండటంతో దిక్కుతోచని భక్తులు ఆలయం వెలుపలే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో గడిచిన రెండురోజులుగా వారు ఆలయ కేసరి సదనం ముందు భాగంలో సొంతంగా వంట వండుకొని తింటూ, రాత్రి ఆరుబయటే బస చేస్తున్నారు. శుక్రవారం పాయసంతోపాటు, అన్నం, సాంబర్, వంకాయ కూర వండుకున్నారు. రాత్రికి అన్నం మాత్రమే వండుకొని ఉదయం చేసిన కూరలతో తిన్నారు. అర్ధరాత్రి కడుపునొప్పితో కూడిన వాంతులు, విరేచనాలు ఒకరి తరువాత మరొకరికి మొదలయ్యాయి. కొద్దిసేపటి వ్యవధిలోనే అస్వస్థతకు గురికావడంతో దాదాపు 10 మందిని వెంటనే గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారు కూడా ఆస్పత్రికి చేరుకొని చికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
విద్యార్థిని బలిగొన్న
ఈత సరదా
వజ్రకరూరు: ఈత సరదా ఓ విద్యార్థి ప్రాణాలు బలిగొంది. వజ్రకరూరు మండలం పీసీపీ కొత్తకోట గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.గ్రామానికి చెందిన చిన్న మాదుల రాజేష్, సోమావతి దంపతులకు ముగ్గురు కుమారులు కాగా, వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరి చిన్న కుమారుడు అరుణ్‌తేజ్ (13) స్థానిక జెడ్పీహెచ్‌ఎస్‌లో 8వ తరగతి చదువుతున్నాడు. శనివారం పాఠశాలకు సెలవు కావడంతో మరో నలుగురు విద్యార్థులతో పాటు తన కుటుంబసభ్యులతో కలిసి గ్రామానికి సమీపంలో ఉన్న సొంత పొలానికి అరుణ్‌తేజ్ వెళ్లాడు. కాసేపు ఆడుకున్న తర్వాత స్నేహితులతో కలిసి బావిలో ఈత కొడుతూ నీటి అడుగు భాగానికి వెళ్లిన అరుణ్‌తేజ్ ఎంత సేపటికీ పైకి రాలేదు. దీంతో కంగారు పడిన స్నేహితుల కేకలు విన్న కుటుంబసభ్యులు వెంటనే అక్కడకు చేరుకుని బావిలో దూకి గాలింపు చేపట్టారు. నీటి అడుగున పూడికలో ఇరుక్కుపోయిన అరుణ్‌తేజ్‌ను వెలికి తీసి ఆగమేఘాలపై ఉరవకొండలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అరుణ్‌తేజ్ మృతి చెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న జెడ్పీహెచ్‌ఎస్ హెచ్‌ఎం రాజ్‌కుమార్, ఉపాధ్యాయులు ఆస్పత్రికి చేరుకుని బాధిత కుటుంబసభ్యులను ఓదార్చారు. విద్యార్థి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


