● భారీగా అరటి ధరల పతనం
● ఈదురుగాలులకు నేలవాలిన చెట్లు
● రైతుల గురించి పట్టించుకోని చంద్రబాబు సర్కారు
అనంతపురం అగ్రికల్చర్: అరటి రైతుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఒక వైపు ధరల్లేక దిక్కులు చూస్తుంటే.. మరోవైపు ఈదురుగాలులకు తోటలు నేలవాలుతుండటంతో నష్టాలు రెట్టింపవుతున్నాయి. కోతకు వచ్చిన నాణ్యమైన మొదటి పంటను కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ఆసక్తి చూపించడం లేదు. టన్ను రూ.20 వేలకు పైగా ఉండాల్సిన ధర ఒక్కసారిగా నేలచూపు చూడటంతో టన్ను రూ.5 వేల నుంచి రూ.7 వేల మధ్యనే విక్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది.
● గత నవంబర్‌లోనే రెండో పంటను అమ్ముకోలేక ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్న రైతులు ఈ ఏడాది మొదటి పంటకే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు నాలుగు రోజులుగా 25 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో పలు మండలాల్లో అరటి తోటలు నేలవాలాయి. ఉద్యానశాఖ అధికారులు మాత్రం 33 శాతం దెబ్బతింటేనే నష్టం నమోదు చేస్తున్న పరిస్థితి. ఇలా పది మండలాల్లో 120 హెక్టార్లలో అరటి తోటలు దెబ్బతినడంతో రూ.4.10 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నట్లు రైతులు వాపోతున్నారు. అరటి తోటలకు రూ.10 కోట్ల నుంచి రూ.12 కోట్ల వరకు నష్టం జరిగినట్లు రైతులు చెబుతున్నారు. అలాగే మరికొన్ని కూరగాయల పంటలు దెబ్బతినడంతో రూ.ఒక కోటి, మొక్కజొన్న, వరి పంటల నష్టం రూ.రెండు కోట్ల వరకు ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద అరటి తోటల రైతులకు ఈ ఏడాదీ కలిసిరాక పెట్టుబడులు కూడా దక్కించులేని దీనస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం, జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులు అరటి రైతుల గురించి ఆలోచించే తీరికలేకపోయింది. ఉద్యానశాఖ మాత్రం మొక్కుబడిగా నష్టం అంచనాలు వేసి చేతులు దులుపుకునే పరిస్థితి నెలకొంది.


