కళ్యాణదుర్గం రూరల్: టీడీపీ సీనియర్ నేత, కళ్యాణదుర్గం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా గుండె, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయనను కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో శనివారం ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్త తెలియగానే వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అభిమానులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. శనివారం ఆయన భౌతికకాయాన్ని స్వగ్రామం ఎర్రంపల్లిలోని స్వగృహానికి తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య, కాంగ్రెస్ నేత ఎన్.రఘువీరారెడ్డి తదితరులు ఎరరంపల్లికి చేరుకుని ఉన్నం హనుమంతరాయచౌదరి పార్థివదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఉన్నం కుటుంబసభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.


