అనంతపురం అర్బన్: ఏ కష్టం వచ్చినా ఆదుకుంటామన్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు అరటి రైతుల కష్టాలు కనిపించడం లేదా అని రైతులు నిలదీశారు. అరటి రైతులను ఆదుకోవాలని కోరుతూ రైతు సంఘం ఆధ్వర్యంలో అరటి గెలలు, బోదెలతో శనివారం కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిరుతల మల్లికార్జున మాట్లాడుతూ యుద్ధం నేపథ్యంలో అరటి పంట ఎగుమతులు నిలిచిపోయాయన్నారు. దీంతో ధర పతనమై రైతులు తీవ్ర నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని ఆదుకునే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడం బాధాకరమన్నారు. 20 రోజుల క్రితం అరటి టన్ను రూ.22 వేల నుంచి రూ.25 వేలు ధర పలికిందన్నారు. ప్రస్తుతం టన్ను ధర ఐదారు వేల రూపాయలకు పడిపోయిందన్నారు. రైతులకు ఏ కష్టం వచ్చినా ఆదుకుంటామని, ధరలు లేకపోతే గిట్టుబాటు ధర కల్పిస్తాంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో గొప్పలు చెప్పారన్నారు. క్షేత్రస్థాయిలో అరటి రైతులు నష్టపోతుంటే మాత్రం పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం తక్షణం స్పందించి టన్ను రూ.25 వేలతో అరటి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలు, ఈదురుగాలులకు అరటి, బొప్పాయి, మొక్కజొన్న, మామిడి, తదితర పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్నప్పయాదవ్, నాయకులు వన్నారెడ్డి, నారాయణస్వామి, రామకృష్ణ, వెంకటరాముడు, రామాంజినేయులు, తదితరులు పాల్గొన్నారు.
నేడు ‘కడపటి యుద్ధం’ ఆవిష్కరణ
అనంతపురం కల్చరల్: విలక్షణ రచయిత బండి నారాయణస్వామి కలం నుంచి జాలు వారిన ‘కడపటి యుద్ధం’ నవల ఆదివారం ఆవిష్కరణ కానుంది. స్పందన అనంత కవుల వేదిక ఆధ్వర్యంలో ఎన్జీఓ హోమ్ వేదికగా జరిగే ఈ కార్యక్రజుమానికి ప్రజాకవి గోరేటి వెంకన్న, భూమన్, లక్ష్మీనరసయ్య, నాగోలు కృష్ణారెడ్డి హాజరు కానున్నారు.


