ఉరవకొండ రూరల్: మండలంలోని రేణుమాకులపల్లిలో టీడీపీ నేతలు బరితెగించారు. ఇరువర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో సర్ది చెప్పేందుకు వెళ్లిన యువకుడిపై దాడి చేసి తమ పైశాచాకాన్ని చాటుకున్నారు. బాధిత కుటుంబసభ్యులు తెలిపిన మేరకు... చిన్నపాటి విషయానికి రేణుమాకులపల్లికి చెందిన దివ్యాంగులతో శుక్రవారం సాయంత్రం టీడీపీ నేతలు గొడవపడ్డారు. ఏకపక్షంగా దివ్యాంగులపై సాగుతున్న దౌర్జన్యాన్ని గమనించిన ఆ గ్రామ సర్పంచ్, వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడు బోయ రామాంజనేయులు కుమారుడు మణి వెంటనే జోక్యం చేసుకుని ఇరు వర్గాల వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో టీడీపీ నేతలు మరింత రెచ్చిపోయి మణిపై కట్టెలతో దాడి చేశారు. తలకు బలమైన గాయాలు కావడంతో మణిని కుటుంబసభ్యులు వెంటనే ఉరవకొండలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. తండ్రి రామాంజనేయులు ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.


