కళ్యాణదుర్గం: ‘ఏయ్... ఇక్కడ ప్రోగ్రాం ఎవడు పెట్టమన్నాడు.. అనుమతి ఉందా.. మీ నాయకుడికి కూడా నోటీసు ఇస్తాం.. తమాషాగా ఉందా.. ఈరోజే మీరు ప్రోగ్రాం పెట్టాలా..? చలానా కట్టారా.. ముందు ఇక్కడి నుంచి వెళ్లకపోతే అందరినీ లోపలేస్తా..’ అంటూ కళ్యాణదుర్గం పట్టణ సీఐ హరినాథ్ వైఎస్సార్‌సీపీ నాయకులను హెచ్చరించారు. శుక్రవారం అక్కమాంబ జాతర సందర్భంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్ రెన్యువల్ విషయంపై వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు లక్ష పోస్టు కార్డుల ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు అక్కమాంబ ఆలయం ఎదురుగా టెంటు వేసుకుని సంతకాల సేకరణ చేపట్టారు. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ హరినాథ్, రూరల్ సీఐ గణేష్ తమ సిబ్బందితో అక్కడికి చేరుకుని ‘సంతకాల సేకరణ కార్యక్రమానికి అనుమతి లేదం’టూ నానా యాగీ చేశారు. ఇది పేద ప్రజల కోసం, కళ్యాణదుర్గం ప్రాంత అభివృద్ధి కోసం పాటు పడిన ఆర్డీటీ సంస్థను కాపాడుకునేందుకు అంటూ వైఎస్సార్‌సీపీ నాయకులు ఎంత చెప్పినా పోలీసులు వినలేదు. జాతరకు వచ్చే ప్రజల్లో టీడీపీపై వ్యతిరేకత వస్తుందన్న భయంతో టీడీపీ నేతల ప్రోద్బలంతో పోలీసులు ప్రజా కార్యక్రమాన్ని అడ్డుకోవడం సర్వత్రా విమర్శలకు తావిచ్చింది. కాగా జాతరకు ఆటంకం కలిగిస్తున్నారన్న నెపంతో వైఎస్సార్‌సీపీ నాయకులు రామాంజినేయులు, భట్టువానిపల్లి అంజి, మల్లాపురం మల్లికార్జునలను పోలీసు స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు అడ్వకేట్ హనుమంతరెడ్డి, సీనియర్ నాయకులు గోపారం శ్రీనివాసులు, తిరుమల వెంకటేశులు, మండల కన్వీనర్‌లు గోళ్ళ సూరి, గొల్ల హనుమంతరాయుడు, నాయకులు రామాంజినేయులు, మల్లాపురం మల్లి, పాతలింగ, భాస్కర్, చరణ్, రామిరెడ్డి, దేవ, పాండు, జానీ, మల్లికార్జున పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో లక్ష పోస్టుకార్డుల ఉద్యమం
కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసుల నానాయాగీ
ఆర్డీటీ పరిరక్షణ కోసం సంతకాల సేకరణ అని చెప్పినా వినకుండా అడ్డంకులు


