పూర్తిస్థాయిలో అధికార దుర్వినియోగం
లక్ష్మీప్రసాద్ అనే వ్యక్తి అనంతపురంలో ప్రజలకు పెద్దగా తెలియదు. శివపార్వతుల కల్యాణ మహోత్సవానికి 30 వేల మందిని సమీకరించడానికి రూ.2 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు ప్రచారం సాగుతోంది. ఇందుకుగానూ ఎక్కువ శాతం నిధులు స్థానికంగా సమీకరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజకీయం కోసం లక్ష్మీప్రసాద్ ఏ కార్యక్రమమైనా చేసుకోవచ్చు. అయితే దీనికి డీఆర్‌డీఏ పీడీగా ఉన్న తన భార్య శైలజ పూర్తిగా సహకరించారనేది వివాదాస్పద అంశం. ఎస్‌ఎస్‌ఏ ఏపీసీగా ఉన్న శైలజ, తన భర్త టీడీపీలో చురుగ్గా ఉండటంతో డీఆర్‌డీఏ పీడీగా అదనపు బాధ్యతలు తెప్పించుకోగలిగారు. శైలజ డ్వాక్రా సంఘాలను ఈ కార్యక్రమానికి రావాలని తన అధికారుల ద్వారా ఒత్తిడి చేయించి రప్పించగలిగారని తెలుస్తోంది. అందుకే నగరంలోని డ్వాక్రా మహిళలు కార్యక్రమానికి వచ్చారని సమాచారం. అలాగే ఓ జిల్లా అధికారి కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడంతో పాటు పూర్తిగా సహకరించారు. వీరిద్దరూ జన సమీకరణతో పాటు ఈ కార్యక్రమానికి విరాళాలు కూడా భారీగా వచ్చేలా తెర వెనుక ప్రయత్నం చేశారనేది ప్రధాన ఆరోపణ. భక్తి ముసుగులో చేసిన ఈ రాజకీయానికి అధికారులు భాగస్వాములు కావడం అనేది ఇప్పుడు అందరిలోనూ చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమానికి ఆహ్వానం కోసం లక్ష్మీప్రసాద్ చాలామందికి ఫోన్లు చేయడం, వ్యక్తిగతంగా కలవడం.. అదే సందర్భంలో ‘మీ ఆశీర్వాదం ఉండాలి’ అని కోరడం భవిష్యత్ రాజకీయాల కోసమేనని తెలుస్తోంది.


