మేథావుల పురిటిగడ్డ ‘ఉమ్మడి అనంత’
పెనుకొండ: మేథావుల పురిటిగడ్డ ఉమ్మడి అనంతపురం జిల్లా అని వక్తలు పేర్కొన్నారు. సామాన్య కుటుంబాల్లో పుట్టిన ఎంతో మంది తమ అసామాన్య ప్రతిభతో జిల్లా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటుతున్నారని పేర్కొన్నారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో శనివారం రాత్రి ‘అనంత ఆణిముత్యాలు పురస్కార ప్రదానోత్సవం’ ఘనంగా జరిగింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేష్‌రెడ్డి, తెలంగాణ చీఫ్ సెక్రటరీ కె. రామకృష్ణా రావు, రిటైర్డ్ డీజీపీ డాక్టర్ కే. అరవిందరావు, ప్రొఫెసర్ నరహరి, స్టేఫిట్ ఫౌండర్ గణపతిరెడ్డి, ఐఎంవీ మొబైల్ సీఈఓ విశ్వనాథ్ ఎల్లురి, ప్రొఫెసర్ అనంతసురేష్, హైదరాబాద్ జేజే హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ జయంతిరెడ్డి, సైంటిస్ట్ కే. కల్యాణి, డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫీసర్ (ఫారెస్ట్) చింతా చైతన్యకుమార్‌రెడ్డి, ముంబైకి చెందిన చట్టనాథన్, టైగ్లోబల్ ప్రెసిడెంట్ మురళి బుక్కపట్నం, మీనాక్షమ్మ ఫౌండేషన్ ఫౌండర్ రమణ, ఆదర్శరైతు గోపాల్, ఆర్‌ఏ అసోసియేట్స్‌కు చెందిన రామకృష్ణగుప్తా, క్రీడాకారులు బి. అనూష్, ఎం. అనూష, ఫోక్ సింగర్ పెద్దక్క, మౌంటెనీర్ ఉపేంద్ర, కుంచే తిప్పేస్వామి, జానపద కళాకారుడు ఆదినారాయణలకు పురస్కారాలు అందించారు. ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో మేథావులకు కొదవలేదన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాల్లో స్థిరపడి జిల్లా ఖ్యాతిని ఘనంగా చాటుతున్నారన్నారు. అనంత గడ్డలో పుట్టడం ఒక వరమని, పట్టుదల, కృషి ఉంటే ఉన్నత స్థానాలకు చేరడం సమస్యే కాదన్నారు. ప్రతి ఒక్కరూ ఆణిముత్యంగా తయారు కావాలని, ఉన్నత స్థానాలకు చేరాలని కోరారు. అనంత ఆణిముత్యాల కార్యక్రమం ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపాలని పేర్కొన్నారు. ఎంతో శ్రమించి ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకుడు ప్రతాపరెడ్డిని అభినందించారు. హాస్యనటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ పేద కుటుంబంలో పుట్టిన తాను ఎంఏ తెలుగు చదివి లెక్చరర్‌గా పని చేశానని, అవకాశం రావడంతో సినిమా రంగంలోకి ప్రవేశించి రాణించానన్నారు. నిర్వాహకుడు ప్రతాపరెడ్డి మాట్లాడుతూ దాతల సహకారంతో సాహితీ గగన్‌మహల్ ట్రస్ట్ నుంచి రూ. 3 కోట్లతో పాఠశాలలకు వసతులు కల్పించినట్లు వెల్లడించారు. స్వార్థ చింతన లేకుండా 3 సంవత్సరాలకు ఒకసారి కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు, స్థానికులు పాల్గొన్నారు.
సన్మానం అందుకుంటున్న రామకృష్ణారావు, జస్టిస్ సురేష్‌రెడ్డి, చిత్రంలో బ్రహ్మానందం, అరవిందరావు
పట్టుదల, కృషి ఉంటే ఉన్నత స్థానాలకు చేరడం సమస్యే కాదు
‘అనంత ఆణిముత్యాలు
పురస్కార ప్రదానోత్సవం’లో వక్తలు
ముఖ్య అతిథిగా హాజరైన
హాస్యనటుడు బ్రహ్మానందం
మేథావుల పురిటిగడ్డ ‘ఉమ్మడి అనంత’


