రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయాలి
● కలెక్టర్ ఆనంద్
అనంతపురం అర్బన్: ‘‘ప్రపంచంలోనే భారత రాజ్యాంగం అత్యున్నతమైనది. మహోన్నతమైన రాజ్యాంగ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పనిచేయాలి. ప్రజలకు బాధ్యతగా మెరుగైన సేవలు సత్వరం అందించాలి’’ అని కలెక్టర్ ఓ.ఆనంద్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో రాజ్యాంగ ప్రవేశిక ఆమోద దినం నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఆదర్శవంతమైన రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ దేశ ప్రజల మదిలో ఉన్నారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా మనమంతా పేదల అభ్యున్నతి, సంక్షేమానికి అంకితభావంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.
అరటి రైతులను ఆదుకుంటాం
శింగనమల (నార్పల): జిల్లాలో అరటి రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఓ.ఆనంద్ పేర్కొన్నారు. బుధవారం నార్పల మండలంలోని గడ్డం నాగేపల్లి పరిధిలో అరటి పంటను పరిశీలించారు. పంట సాగు విధానంపై రైతులతో ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పంటల సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయిస్తామన్నారు. అరటి నాణ్యత పెరగడానికి ఏం చేయాలన్న దానిపై ప్రణాళిక రూపొందించాలని ఉద్యాన శాఖాధికారులకు సూచించారు. ఒక పంటను పదేపదే సాగు చేయడం వల్ల ఇబ్బందులు వస్తాయని, పంట మార్పిడి చేయాలన్నారు. రైతుల వద్ద తీసుకునే అరటికి కేజీ రూ.6, ఎగుమతి చేసే అరటికి రూ.8 అందించాలని కంపెనీల నిర్వాహకులకు సూచించామన్నారు. తీవ్రంగా నష్టపోయామని రైతులు విన్నవించగా, విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. జిల్లా ఉద్యాన అధికారి ఉమాదేవి, ఏపీఎంఐపీ ఏపీడీ ధనంజయ తదితరులు ఉన్నారు.
ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లించండి
అనంతపురం సిటీ: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించనున్న పదో తరగతి, ఇంటర్ పబ్లిక్ పరీక్షలు మార్చిలో ప్రారంభం కానున్నట్లు డీఈఓ ప్రసాద్‌బాబు బుధవారం తెలిపారు. ఇందుకు సంబంధించి విద్యార్థులు డిసెంబర్ ఒకటి నుంచి 15వ తేదీలోపు పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించారు. ఏపీ ఆన్‌లైన్ సేవా కేంద్రం లేదా ఆన్‌లైన్ పేమెంట్ గేట్‌వే ద్వారా నేరుగా చెల్లించవచ్చని వివరించారు. అపరాధ రుసుము లేకుండా డిసెంబర్ 1 నుంచి 10వ తేదీ వరకు, రూ.25 అపరాధ రుసుముతో 11 నుంచి 12వ తేదీ వరకు, రూ.50తో 13 నుంచి 15 వరకు చెల్లించవచ్చన్నారు. పరీక్ష ఫీజు వివరాలకు వెబ్‌సైట్ www.apopenschool.ap.gov.in చూడాలని సూచించారు.
దరఖాస్తు గడువు
పొడిగింపు
అనంతపురం సిటీ: జిల్లా కేంద్రంలోని సెయింట్ మేరీస్ బాలికల ఎయిడెడ్ పాఠశాల, ఆర్‌సీఎం ఎయిడెడ్ ప్రైమరీ పాఠశాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగించినట్లు డీఈఓ ప్రసాద్‌బాబు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. దరఖాస్తు గడువును డిసెంబర్ 10వ తేదీ వరకూ పొడిగించినట్లు వెల్లడించారు.
విందు భోజనం తిని
20 మందికి అస్వస్థత
ఓడీచెరువు: మండల పరిధిలోని బత్తినపల్లిలో బుధవారం జరిగిన ఓ శుభకార్యంలో పాల్గొని విందుభోజనం ఆరగించిన వారిలో 20 మంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు కావడంతో బంధువులు వారిని ఓడీచెరువు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఏడుగురిని కదిరి ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని, బత్తినపల్లిలోనూ వైద్య శిబిరం ఏర్పాటు చేశామని స్థానిక వైద్యుడు కమల్ రోహిత్ తెలిపారు. అయితే కలుషితమైంది ఆహారమా...నీరా అన్న విషయం తెలియాల్సి ఉందన్నారు.
రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయాలి


