కర్ణాటక న్యాయవాదిపై ‘పచ్చ’ మూక దాడి | - | Sakshi
Sakshi News home page

కర్ణాటక న్యాయవాదిపై ‘పచ్చ’ మూక దాడి

Nov 28 2025 9:07 AM | Updated on Nov 28 2025 9:07 AM

కర్ణాటక న్యాయవాదిపై ‘పచ్చ’ మూక దాడి

కర్ణాటక న్యాయవాదిపై ‘పచ్చ’ మూక దాడి

కళ్యాణదుర్గం: స్థానిక జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులోఓ కేసులో వాదనలు వినిపించి తిరిగి బళ్లారికి వెళుతున్న కర్ణాటక న్యాయవాది, బళ్లారి బార్‌ అసోసియేషన్‌ సీనియర్‌ సభ్యుడు వై.కొట్రేష్‌పై స్థానిక టీడీపీ నేతలు దాడికి తెగబడ్డారు. వివరాలు... కళ్యాణదుర్గం టీడీపీకి చెందిన ఓ నేత తన కుమార్తెను బళ్లారికి చెందిన యువకుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. అయితే కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమె పుట్టింటికి చేరుకుని భర్త, అత్తపై వరకట్న వేధింపులు, చిత్రహింసల కేసు పెట్టింది. ఈ కేసు విషయంగా స్థానిక జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో వివాదం నడుస్తోంది. ఇదే కేసులో ఆమె భర్త, అత్తకు అరెస్ట్‌ వారెంట్‌ జారీ కావడంతో కక్షిదారులతో కలసి బుధవారం కళ్యాణదుర్గంలోని కోర్టుకు న్యాయవాది వై.కొట్రేష్‌ హాజరయ్యారు. సాయంత్రం వారెంట్‌ను రద్దు చేయించి కారులో తిరుగు ప్రయాణమయ్యారు. బైపాస్‌ రోడ్డులోని గాంధీ విగ్రహం వద్దకు చేరుకోగానే గోళ్ల గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు ద్విచక్రవాహనాన్ని అడ్డుగా పెట్టి న్యాయవాది కారును అడ్డుకున్నారు. కారులో ఉన్న న్యాయవాదితో పాటు అతని క్లయింట్లపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. స్థానికులు వారిస్తున్నా వినకుండా ‘లాయర్‌ అయితే ఏంటి.... జడ్జి అయితే ఏంటి...’ అంటూ దుర్భాషలతో రెచ్చిపోయారు. ఆ సమయంలో అక్కడే ఉన్న దుకాణాల నిర్వాహకులు దాడిని అడ్డుకుని న్యాయవాదిని సురక్షితంగా కళ్యాణదుర్గం పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు చేర్చారు. అయితే అదే సమయంలో టీడీపీ కార్యకర్తలు స్టేషన్‌ వద్దకు చేరుకుని న్యాయవాదికి సహకరించిన స్థానికులపై దాడికి యత్నించారు. విధుల్లో ఉన్న సీఐ హరినాథ్‌ వెంటనే ఇరువర్గాలకు సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం న్యాయవాది ఫిర్యాదు మేరకు గోళ్ల గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త వెంకటేష్‌తో పాటు 8 మందిపై కేసు నమోదు చేశారు. అలాగే టీడీపీ నేతల నుంచి ఫిర్యాదు స్వీకరించి న్యాయవాది వై.కొట్రేష్‌పై కేసు నమోదు చేశారు.

విధులు బహిష్కరించిన న్యాయవాదులు

కర్ణాటక న్యాయవాదిపై జరిగిన దాడిని ఖండిస్తూ కళ్యాణదుర్గం బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పార్థసారథి, వైస్‌ ప్రెసిడెంట్‌ టి.రామాంజినేయులు, సీనియర్‌ న్యాయవాదులు హనుమంతరెడ్డి, దేవేంద్ర, కరణం తిప్పేస్వామి, మల్లికార్జున, బీటీ రామాంజనేయులు, సంపత్‌కుమార్‌, తిమ్మప్ప చౌదరి, పట్టాభి, హరిచక్రవర్తి, సుదర్శన్‌, ముత్యాలు, తిప్పేస్వామి, మంజు, టీపీ కిరణ్‌తో పాటు పలువురు రెండు రోజుల పాటు విధులను బహిష్కరించి, కోర్టు ప్రాంగణంలో నిరసన వ్యక్తం చేశారు. బళ్లారి బార్‌ అసోసియేషన్‌ సీనియర్‌ సభ్యుడు వై. కొట్రేష్‌పై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఓ కేసు విషయంగా కళ్యాణదుర్గం కోర్టుకు హాజరై బళ్లారికి వెళ్తుండగా ఘటన

న్యాయవాది కారుకు ద్విచక్ర వాహనాన్ని అడ్డుపెట్టి దాడి చేసిన వైనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement