అసలే తండా.. అభివృద్ధి తంటా
శింగనమల: మండలంలోని నాగులగుడ్డం తండా అభివృద్ధికి నోచుకోవడం లేదు. నిధుల లేమితో ఈ పరిస్థితి దాపురించిందని అనుకుంటే పొరపాటే. గ్రామాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.కోటి నిధులను స్వాహా చేసేందుకు సిద్ధమైన టీడీపీ నేతలు మూడు గ్రూపులుగా విడిపోయి గ్రామాభివృద్ధిని పూర్తిగా అడ్డుకోవడం గమనార్హం. అసలే మారుమూల తండా ప్రాంతం, పైగా గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని టీడీపీ నేతలు తమ ఆధిపత్యం కోసం చివరకు తాగునీరు కూడా అందకుండా చేశారు.
గ్రామాభివృద్ధికి కేంద్రం నిధులు
‘ధర్తీ ఆబా జంజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్’ పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తూ గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి చర్యలు చేపట్టింది. ఈ పథకం కింద ఎంపిక చేసిన గిరిజన తండాల్లో అభివృద్ధి పనులకు పుష్కలంగా నిధులు మంజూరు చేసింది. తొలి విడతలో జిల్లాలోని మూడు గిరిజన తండాలను ఎంపిక చేయగా.. అందులో శింగనమల మండలంలోని నాగులగుడ్డం తండా ఒకటి. ఈ క్రమంలో పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి నాగులగుడ్డం తండాలో వారంలో ఒక రోజు చొప్పన గ్రామస్తులతో అధికారులు సమావేశాలు నిర్వహించి, గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను ఆరా తీసి, నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపారు. ఇందులో సీసీ రోడ్లు, తాగునీటి పైపులైన్లు, గృహ నిర్మాణాలు, పంచాయతీ భవనం, కమ్యూనిటీ భవనం తదితర పనులు ఉన్నాయి. ఈ ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ తొలి విడతలో రూ.కోటికి పైగా నిధులను తొమ్మిది నెలల క్రితం మంజూరు చేసింది. ఇందులో గ్రామంలో సీసీ రహదారులకు రూ.48 లక్షలు, తాగునీటి పైప్‌లైన్ కోసం రూ.25 లక్షలు, పంచాయతీ భవన నిర్మాణానికి రూ.35 లక్షలు చొప్పున కేటాయించారు. అలాగే నూతన గృహ నిర్మాణాలనూ మంజూరు చేసింది.
ముందుకు సాగని పనులు
టీడీపీ నేతల ఆధిపత్య పోరులో నాగులగుడ్డం తండాలో అభివృద్ధి పనులు పూర్తిగా పడకేశాయి. టీడీపీలో నాయకులు మూడు గ్రూపులుగా విడిపోయి పనులు తమకు కావాలంటే తమకు కావాలని పోటీ పడ్డారు. అధికారులు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వారిలో మార్పు రాలేదు. ఈ క్రమంలో తాగునీటి కోసం కేటాయించిన రూ.25 లక్షలతో బోరుబావి తవ్వించి, మోటారు ఏర్పాటు చేశారు. గ్రామంలో పైప్‌లైన్ వేశారు. అయితే ఇది నచ్చని టీడీపీ నేతలు రాత్రికి రాత్రే బోరు ఉంచి మోటారును లాగేసి పక్కకు పడేశారు. దీంతో నాగులగుడ్డం తండా వాసుల పరిస్థితి ‘అమ్మ పెట్టదు.. అడుక్కు తిననివ్వదు’ అనే చందంగా మారింది. గ్రామాల అభివృద్ధికి చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటి వరకూ పైసా నిధులు కేటాయించలేదు. పోనీ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతోనైనా గ్రామాల్లో అభివృద్ధి పనులు సాగుతున్నాయా అంటే.. అది కూడా టీడీపీ నేతల ధన దాహానికి బలవుతున్నాయి. ప్రస్తుతం గుక్కెడు తాగునీటి కోసం తండా వాసులు పొలాల వెంట పరుగు తీయాల్సి వస్తోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు కాస్త వెనక్కు మళ్లే అవకాశముంది.
మోటారు బిగించాలని చెప్పానే...
నాగులగుడ్డం తండాలో తాగునీటి పథకానికి సంబంధించిన విద్యుత్ మోటారును బోరు నుంచి పెకలించినట్లుగా తెలిసింది. అయితే దీనిపై అప్పట్లోనే స్పందించాం. మోటారును వెంటనే బిగించాలని చెప్పాం. ఇప్పటి వరకూ బిగించలేదా? ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాం.
– భాస్కర్, ఇన్‌చార్జ్ ఎంపీడీఓ, శింగనమల
‘తమ్ముళ్ల’ కుమ్ములాటతో పడకేసిన గిరిజన గ్రామాభివృద్ధి
అభివృద్ధి పనులకు అడుగడుగునా ఆటంకాలు
తాగునీరు సైతం అందకుండా మోటారు పెకలించిన టీడీపీ నేతలు
మురిగిపోనున్న రూ.కోట్ల నిధులు
అసలే తండా.. అభివృద్ధి తంటా


