రైతుల ఆదాయం పెంపే లక్ష్యం
● కేంద్ర నోడల్ అధికారి సుజాత శర్మ
అనంతపురం అర్బన్: రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా రాబోవు ఆరేళ్లకు సంబంధించి ప్రణాళిక రూపొందించాలని సంబంధిత అధికారులను ప్రధాన మంత్రి ధన్ ధాన్య కృషి యోజన (పీఎండీడీకేవై) కేంద్ర నోడల్ అధికారి సుజాత శర్మ ఆదేశించారు. పీఎండీడీకేవై పథకంపై గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్ ఆనంద్, జేసీ శివ్ నారాయణ్ శర్మతో కలిసి అధికారులతో ఆమె సమీక్షించారు. పీఎండీడీకేవై పరిధిలోని 11 శాఖలకు సంబంధించి 36 పథకాలను సమన్వయంతో అమలు చేయాలన్నారు. ఎఫ్‌పీఓ (రైతు ఉత్పత్తి సంఘాలు) ఏర్పాటుపై దృష్టి పెట్టాలన్నారు. ఉద్యాన పంటల్లో నూతన రకాలను పరిచయం చేయడంతో పాటు సాగు, ఉత్పత్తి పెంచడంపై రైతులకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయంపై రైతులను చైతన్యపరచాలని ఆదేశించారు. పట్టు పరిశ్రమ, పశుసంవర్ధక, మత్స్య శాఖల పరిధిలో కేటాయించిన లక్ష్యాలను చేరుకోవాలన్నారు. జిల్లాలో పీఎం ఫసల్‌బీమా యోజన, కిసాన్ క్రెడిట్ కార్డ్, నేషనల్ మిషన్ ఫర్ న్యాచురల్ ఫామింగ్, పీఎం కృషి వికాస్ యోజన, తదితర పథకాల అమలును కలెక్టర్ వివరించారు. సమావేశంలో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు ఉమామహేశ్వరమ్మ, ఉమాదేవి, రఘునాథరెడ్డి, ప్రేమ్‌చంద్, విజయకుమార్, చంద్రశేఖర్‌రెడ్డి, లక్ష్మానాయక్, సీపీఓ అశోక్ కుమార్, కేవీకే శాస్త్రవేత్త మల్లీశ్వరి, డ్వామా పీడీ సలీమ్‌బాషా, డీసీఓ అరుణకుమారి, ఎల్‌డీఎం నరేష్‌రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ శైలజ, మైనర్ ఇరిగేషన్ ఎస్‌ఈ విశ్వనాథరెడ్డి, పరిశ్రమల శాఖ జీఎం శ్రీనివాసరావు పాల్గొన్నారు.
= రాప్తాడు: మండలంలోని హంపాపురం, రామినేపల్లి గ్రామాల్లో కేంద్ర నోడల్ అధికారి సుజాత శర్మ పర్యటించారు. దానిమ్మ, ద్రాక్ష పంటలను పరిశీలించారు. పంటల సాగు వివరాలు, దిగుబడి, సేంద్రియ వ్యవసాయ పద్ధతులు, సస్యరక్షణపై స్థానిక రైతులతో ఆరా తీశారు. ఆమె వెంట జేసీ శివ్ నారాయణ్ శర్మ, డీఏఓ ఉమామహేశ్వరమ్మ, డీహెచ్‌ఓ ఉమాదేవి, ఏపీఎంఐపీ పీడీ రఘనాథ రెడ్డి తదితరులు ఉన్నారు.


