‘ఎస్‌ఐఆర్’పై అవగాహన కల్పించాం
● సీఈఓకు తెలిపిన కలెక్టర్ ఆనంద్
అనంతపురం అర్బన్: ఓటరు జాబితాకు సంబంధించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)పై అధికారులు, సిబ్బందికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించామని రాష్ట్ర ప్రధాన ఎలక్టోరల్ అధికారి (సీఈఓ) వివేక్ యాదవ్‌కు కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. ఎస్‌ఐఆర్ సన్నాహక కార్యకలాపాలపై సీఈఓ గురువారం విజయవాడ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. స్థానిక కలెక్టరేట్ నుంచి కలెక్టర్‌తో పాటు డీఆర్‌ఓ ఎ.మలోల, ఎన్నికల విభాగం డీటీ కనకరాజు పాల్గొన్నారు. ఎలక్టోరల్ రోల్స్, ఓటరు మ్యాపింగ్, ఎస్‌ఐఆర్‌పై సీఈఓ పలు సూచనలు చేశారు. అనంతరం జిల్లాలో చేపట్టిన ప్రక్రియపై కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటరు మ్యాపింగ్ ప్రక్రియ 25.91 శాతం పూర్తయ్యిందన్నారు. జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేయనున్న 330 పోలింగ్ కేంద్రాలకు బూత్ లెవల్ అధికారుల (బీఎల్‌ఓ) నియామకానికి ప్రతిపాదనలు పంపిస్తామన్నారు. కార్యక్రమంలో ఎన్నికల విభాగం ఎస్‌ఏ శామ్యూల్ బెంజిమన్, టెక్నికల్ అసిస్టెంట్ శివ పాల్గొన్నారు.
వివాహిత ఆత్మహత్యాయత్నం
కళ్యాణదుర్గం రూరల్: తాకట్టు పెట్టిన బంగారాన్ని ఇవ్వలేదంటూ ఓ వివాహిత ఆత్మహత్యకు ప్రయత్నించింది. వివరాలు.. కళ్యాణదుర్గంలోని కమ్మరచెట్ల వీధికి చెందిన వివాహిత శైలు.. స్థానిక వాల్మీకి సర్కిల్‌లోని ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీలో బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకుంది. బంగారాన్ని విడిపించుకునేందుకు గురువారం ఫైనాన్స్ కంపెనీకి వెళ్లిన సమయంలో ఖాతా హోల్డ్‌లో ఉండడంతో సొత్తు ఇవ్వడం కుదరదని సిబ్బంది తెలిపారు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఇంటికి చేరుకుని పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే స్థానిక సీహెచ్‌సీకి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అనంతపురానికి తీసుకెళ్లారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
పామిడి ఏపీఎంఎస్ విద్యార్థుల మధ్య గొడవ
పామిడి: స్థానిక ఏపీ మోడల్‌స్కూల్‌లో చదువుకుంటున్న కత్రిమల గ్రామ విద్యార్థుల మధ్య గొడవ చోటు చేసుకుంది. గురువారం సాయంత్రం పాఠశాల నుంచి బస్సులో గ్రామానికి వెళుతున్న సమయంలో ఇద్దరు విద్యార్థులు గొడవ పడ్డారు. ఓ విద్యార్థి తన చేతిలోని వాటర్ బాటిల్‌తో దాడి చేయబోతుండగా అది వెళ్లి పక్కనే ఉన్న 7వ తరగతి విద్యార్థి తలకు తగిలి రక్తగాయమైంది. క్షతగాత్రుడికి స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అనంతరం అనంతపురానికి తీసుకెళ్లారు. ఘటనపై పామిడి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
త్రిచక్ర వాహనాల కోసం దరఖాస్తు గడువు పొడిగింపు
అనంతపురం సిటీ: అర్హులైన దివ్యాంగులకు వంద శాతం రాయితీతో మూడు చక్రాల వాహనాల మంజూరుకు దరఖాస్తు గడువును ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించారు. ఈ మేరకు విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకురాలు జి.అర్చన గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. అర్హులైన వారు www.apdascac.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
‘ఎస్‌ఐఆర్’పై అవగాహన కల్పించాం


