మా డబ్బు తిరిగివ్వండి!
రాప్తాడు/రాప్తాడు రూరల్: రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లి పంచాయతీ చిన్మయనగర్ సమీపంలోని జగనన్న కాలనీలో రౌడీషీటర్, టీడీపీ నాయకుడు ఉప్పర శ్రీనివాసులు నుంచి ప్లాట్లు కొనుగోలు చేసిన వారిలో ఆందోళన నెలకొంది.‘ప్లాట్లు వద్దు, ఏమీ వద్దు.. మా డబ్బులు మాకు తిరిగివ్వండి’ అంటూ నిలదీసినట్లు తెలి సింది. వివరాలు.. చిన్మయనగర్ సమీపంలోని జగనన్న కాలనీలో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అనంతపురం నగరానికి చెందిన 650 మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే అనంతపురం, రాప్తాడు ఎమ్మెల్యేలు దగ్గుపాటి ప్రసాద్, పరిటాల సునీత ప్రధాన అనచరుడు, రౌడీషీటర్ ఉప్పర శ్రీనివాసులు ఈ జగనన్నకాలనీలో ‘పరిటాల సునీతమ్మ కాలనీ’ పేరుతో బోర్డు ఏర్పాటు చేసి మొత్తం భూమిలో సెంటున్నర ప్రకారం 512 ప్లాట్లు వేసి లేఔట్ తయారు చేసి బేరంపెట్టాడు. ఒక్కో ప్లాటు రూ. 2 లక్షల చొప్పున ఇప్పటికే దాదాపు 300 ప్లాట్లు అమ్మేశాడు. ఈ వైనంపై ‘సాక్షి’లో మంగళవారం ‘పేదల ప్లాట్లపై పచ్చ రాబందు’ శీర్షికతో ప్రచురితమైన కథనం కలకలం రేపింది. రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. అసలు విషయం తెలియక, ఎవరో చెప్పిన మాటలు విని ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఆ ప్రాంతానికి వచ్చి ఆరా తీశారు. తక్కువ ధరకు వస్తుందనే ఆశతో ప్లాట్లు కొనుగోలు చేశామని భవిష్యత్తులో ఇవి ఉంటాయా.. లేదంటే ప్రభుత్వం తీసుకుంటుందా అంటూ వాపోయినట్లు తెలిసింది.
తొంగిచూడని అధికారులు
కలెక్టరేట్‌కు 5 కిలోమీటర్ల దూరంలోనే ప్రభుత్వ ఆస్తిని పబ్లిక్‌గా బేరం పెట్టి అమ్ముతున్నా అధికారులు ఆవైపు తొంగిచూడక పోవడం అనుమానాలకు తావిస్తోంది. అటు కార్పొరేషన్ అధికారులు, ఇటు రెవెన్యూ అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు తప్పితే ఈ ప్రాంతాన్ని పరిశీలించకపోవడం గమనార్హం. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఉన్నతాధికారులు కూడా వెనుకడుగు వేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు బాధితులు కలెక్టర్‌ను కలిసేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలిసింది. తమకు కేటాయించిన ప్లాట్లను అమ్మకాలు చేశారని, విచారించి ప్లాట్లు తిరిగి ఇప్పించాలంటూ విన్నవించనున్నట్లు సమాచారం.
ఎవరూ రారు.. మేం చూసుకుంటాం!
ఉప్పర శ్రీనివాసులు నుంచి ప్లాట్లు కొనుగోలు చేసిన వారిలో కొందరు ఆయనతో పాటు అనుచరులను కలిసినట్లు తెలిసింది. ‘రేప్పొద్దున ప్రభుత్వం వీటిని తీసుసుకుంటే మా పరిస్థితి ఏమిటి? ప్లాట్లు వద్దు, మా డబ్బు మాకివ్వండి’ అని నిలదీయగా.. ‘మీ ప్లాట్ల జోలికి ఎవరూ రారు. ఎవరు వచ్చినా మేము చూసుకుంటాం’ అని అభయమిచ్చినట్లు తెలిసింది.
రాప్తాడు మండలం చిన్మయనగర్ జగనన్న కాలనీకి బాధితుల క్యూ
మీ ప్లాట్ల జోలికి ఎవరూ రారని చెబుతున్న అక్రమార్కులు


