● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ‘అనంత’ మండిపాటు
అనంతపురం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన పవిత్రమైన భారత రాజ్యాంగాన్ని పక్కనపెట్టి రెడ్‌బుక్ రాజ్యాంగంతో అరాచకాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామి రెడ్డి విమర్శించారు. బుధవారం జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి ‘అనంత’ ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..కుల, మత, వర్గాలకతీతంగా ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు అందడానికి కారణం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగ మేన్నారు. అంబేడ్కర్ దూరదృష్టితో రాజ్యాంగ రూపకల్పన చేశారన్నారు.చంద్రబాబు ప్రభుత్వంలో కొన్ని దుష్టశక్తులు అధికారాన్ని అడ్డుపెట్టుకొని పవిత్రమైన రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం చాలా శక్తివంతమైనదన్నారు. రాష్ట్రపతి మొదలు సామాన్యుడి వరకు అందరూ సమాన హక్కులు అనుభవిస్తున్నారంటే రాజ్యాంగం గొప్పదనమనేని పేర్కొన్నారు. అటువంటి రాజ్యాంగాన్ని పక్కనపెట్టి ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం క్షమించరానిదన్నారు. దీన్ని ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. ప్రజల గొంతు నొక్కేలా అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాలను పంచుకున్నా అక్రమ కేసులు బనాయించడం చంద్రబాబు ప్రభుత్వానికి తగదన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సామాజిక న్యాయశిల్పి డాక్టర్ అంబేడ్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేస్తే దాన్ని రక్షించలేని స్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. దీనిపై అందరూ శాంతియుతంగా పోరాటాలు చేసి గాంఽధీజీ బాటలో పయనించాలని పిలుపునిచ్చారు. అనంతరం జెడ్పీ కార్యాలయం వద్ద ఉన్న బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, మేయర్ వసీం, డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి బీసీ రమేష్ గౌడ్, నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్ రెడ్డి, సీనియర్ నాయకులు అనంత చంద్రా రెడ్డి, మీసాల రంగన్న, రాష్ట్ర మైనార్టీ విభాగం జనరల్ సెక్రటరీ కాగజ్ ఘర్ రిజ్వాన్, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మల్లెమీద నరసింహులు , పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాస రెడ్డి, అమరనాథ రెడ్డి, వెన్నం శివారెడ్డి, జానీ, సాకే కుళ్లాయప్ప, సాకే చంద్రలేఖ, శ్రీనివాస నాయక్, చామలూరు రాజగోపాల్, భారతి, రాధాయాదవ్, అంజలి, శోభ, కసిరెడ్డి కేశవరెడ్డి, రాధాకృష్ణ, వెన్నపూస రామచంద్రారెడ్డి, కమల్‌భూషణ్, మల్లెల వేణు, కై లాష్, గుజ్జల లక్ష్మణ్, రహంతుల్లా, టీవీ చంద్రమోహన్ రెడ్డి, జావీద్, అనిల్‌కుమార్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.


