‘ప్రైవేటు’కు డీఎల్‌జారీ ప్రక్రియ
● త్వరలో అమల్లోకి నూతన విధానం
అనంతపురం సెంట్రల్: రవాణా శాఖలో కీలకమైన డ్రైవింగ్ లైసెన్స్(డీఎల్) మంజూరు ప్రక్రియ త్వరలో ప్రైవేటు చేతుల్లోకి చేరనుంది. దరఖాస్తు చేసుకునే వారికి శిక్షణతో పాటు లైసెన్స్ మంజూరు చేసే అధికారాలు కూడా ప్రైవేటు వారికే కల్పించనున్నారు. రవాణా శాఖ ద్వారా వాహనదారులకు అందిస్తున్న సేవల్లో డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు ప్రధానమైనది. రోజూ వందల మంది వాహనదారులు డీఎల్, ఎల్‌ఎల్‌ఆర్ టెస్ట్‌ల కోసం రవాణా శాఖ కార్యాలయానికి వస్తుంటారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ఆటోమేటిక్ టెస్ట్ డ్రైవ్ సెంటర్ ద్వారా, తాడిపత్రి, గుంతకల్లు, కళ్యాణ దుర్గం ప్రాంతీయ కార్యాలయాల్లో ఫిజికల్ టెస్ట్‌ల ద్వారా డీఎల్ మంజూరు చేస్తున్నారు.
జిల్లాకు మూడు కేంద్రాలు...
జనాభా ప్రాతిపదికన డ్రైవింగ్ టెస్ట్ లైసెన్స్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. 5 లక్షల నుంచి 6 లక్షలకు ఓ సెంటర్ ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఈ లెక్కన జిల్లాలో మూడు సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. జిల్లాలో ఎక్కడైనా సెంటర్లు ఏర్పాటు చేయవచ్చని, ఇందుకు ఫిబ్రవరి 26 వరకూ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్లు డీటీసీ వీర్రాజు తెలిపారు. రెండు ఎకరాల స్థలం, ఏదైనా ఎన్‌జీఓ, ఆర్గనైజేషన్ పేరుతో ఫర్మ్, రూ. 50 లక్షల ష్యూరిటీ, నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ నుంచి సర్టిఫికెట్ తదితర నిబంధనలు ఉన్నాయి. ఇప్పటికే రెండు దరఖాస్తులు అందగా.. మరో రెండు పరిశీలనలో ఉన్నాయి. టీడీపీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యేకు ఒకటి దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది.
నిర్వీర్యం దిశగా రవాణా శాఖ...
రవాణా శాఖ ద్వారా అందిస్తున్న సేవలన్నీ ఒక్కొక్కటిగా ప్రైవేటు పరం అవుతున్నాయి. ఇప్పటికే వాహన రిజిస్ట్రేషన్‌ను ఆయా షోరూంలకు, ఫిట్‌నెస్ ప్రక్రియను శివశంకర్ ఎంటర్‌ప్రైజెస్‌కు అప్పగించారు. తాజాగా డ్రైవింగ్ లైసెన్స్‌లు జారీ ప్రక్రియను కూడా ప్రైవేటుకు అప్పజెబుతుండడం గమనార్హం. దీంతో ఇకపై వాహనదారులు ఆర్టీఏ కార్యాలయానికి రావాల్సిన పని ఉండదు. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకే ప్రైవేటుకు అప్పజెబుతున్నట్లు చెబుతున్నా.. ప్రైవేటు ఏజెన్సీలపై పర్యవేక్షణ బాధ్యతలు ఆర్టీఏ అధికారులకు లేకపోవడం చూస్తే అక్రమాలు మరింత పెరిగే అవకాశం లేకపోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.


