రాప్తాడు: ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందపడిన ఘటనలో రాప్తాడు మండలం పాలవాయి గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు, మాజీ డీలర్ అంకే శివయ్య (44) మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.... వివరాలు.. ఆదివారం సాయంత్రం ద్విచక్ర వాహనంలో అనంతపురానికి వెళ్లిన శివయ్య.. అక్కడ 30 కిలోల అలసందల బస్తా తీసుకుని ద్విచక్ర వాహనంలో తిరుగు ప్రయాణమయ్యాడు. ప్రసన్నాయపల్లి పంచాయతీలోని జన్మభూమినగర్ సమీపంలో 44వ జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా కుక్క అడ్డుగా రావడంతో బైక్ అదుపుతప్పి రోడ్డుపై పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన శివయ్యను 108 అంబులెన్స్ ద్వారా సర్వజనాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య రాజమ్మ, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.
కేసు నమోదుకు కొర్రీలు..
ప్రమాదం జరిగిన ప్రాంతం రాప్తాడు పీఎస్, అనంతపురం 4వ పట్టణ పీఎస్ సరిహద్దున చోటు చేసుకోవడంతో కేసు నమోదుకు పోలీసులు కొర్రీలు వేస్తూ వచ్చారు. ఆ ప్రాంతం తమది కాదంటే తమది కాదని పోలీసులు తెలుపుతూ బాధిత కుటుంబ సభ్యులను రెండు పోలీస్ స్టేషన్ల మధ్య పోలీసులు ఆడుకున్నారు. చివరకు రాత్రి 9 గంటలకు రాప్తాడు పోలీసులు కేసు నమోదు చేశారు.


