
యువతులు అన్ని రంగాల్లోనూ రాణించాలి
● ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి పిలుపు
అనంతపురం కల్చరల్: యువతులు అన్ని రంగాల్లోనూ రాణించాలని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి పిలుపునిచ్చారు. ఐద్వా (అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం) రాష్ట్ర మహాసభల సందర్భంగా మూడురోజుల పాటు సాగిన సాంస్కృతికోత్సవాలు శనివారం ఘనంగా ముగిశాయి. అనంతపురంలోని ఆర్ట్స్ కాలేజ్ డ్రామా హాలు వేదికగా సాగిన వేడుకలకు ఐద్వా రాష్ట్ర నేతలు రమాదేవి, సావిత్రి, డాక్టర్ ప్రసూన, డాక్టర్ జగర్లపూడి శ్యామసుందరశాస్త్రి, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు రియాజుద్దీన్, వన్నూర్ మాస్టర్ తదితరులు ఆత్మీయ అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవం కూడా కలిసి రావడంతో వారు చిన్నారులకు బోధనా పద్ధతుల్లో మహిళల శక్తిని, సాధికారతను వివరించిన తీరు ప్రశంసలందుకుంది.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
ముగింపు ఉత్సవాలలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ముఖ్యంగా అశోక్‌మాస్టర్ , విజయ్‌మాస్టర్ శిష్య బృందాలతో కలిసి పల్లెటూరు మా పల్లెటూరు, ఘల్లు ఘల్లు జోడెద్దులబండిరా నృత్యాలు, వరకట్నం లఘునాటికను నిషిత , ఆరాధ్యా బృందాల అద్భుతంగా ప్రదర్శించి మెప్పించారు. అలాగే ప్రజానాట్యమండలి కళాకారుల ఉద్దీపన గీతాలతో ఆడిటోరియాన్ని హోరెత్తించారు. అనంతరం మూడురోజులుగా ప్రేక్షకులను అలంరింపజేసిన మాస్టర్లకు, చిన్నారులకు జ్ఞాపికలందించారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు శ్యామల, చంద్రిక, అశ్విని, రామాంజనమ్మ తదితరులు పాల్గొన్నారు.