
గురుకులాల సమస్యలపై అలసత్వం
అనంతపురం సిటీ: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఎన్.రమణారెడ్డి ధ్వజమెత్తారు. అనంతపురంలోని ఉపాధ్యాయ భవన్‌లో ఎస్టీయూ అనుబంధం సాంఘిక సంక్షేమ గురుకుల విభాగం రాష్ట్ర స్థాయి ప్రతినిధి లక్ష్మీనారాయణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై రమణారెడ్డి మాట్లాడారు. గురుకులాల్లో పాత టైం టేబుల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. పీజీటీ హిందీ పోస్టును పునరుద్ధరించాలని గురుకుల విభాగం రాష్ట్ర ప్రతినిధి లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని కోరారు. గురుకులాల్లోని క్వార్టర్స్‌కు ఏడాదిన్నర కాలంగా పూర్తి హెచ్‌ఆర్‌ఏ పేరుతో రూ.8 వేల నుంచి రూ.15 వేల వరకు ముక్కుపిండి వసూలు చేస్తున్నారని రాష్ట్ర కో కన్వీనర్ రామానాయుడు ధ్వజమెత్తారు. అయితే క్వార్టర్స్ శిథిలావస్థకు చేరినా పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. గురుకులాల్లో డీఎస్పీ ద్వారా పోస్టు కోల్పోయిన పార్ట్ టైం టీచర్లకు మిగిలిన ఖాళీల్లో అవకాశం కల్పించాలని మరో ప్రతినిధి ఫకృద్దీన్ కోరారు. అదనపు ప్రధాన కార్యదర్శి సూర్యుడు, అసోసియేట్ అధ్యక్షుడు నారాయణస్వామి, తిరుపతయ్య మాట్లాడారు. జిల్లా కార్యదర్శి మల్లికార్జున, అరుణ్‌కుమార్, చిన్నన్న, హనమంతు, వన్నూరుస్వామి తదితరులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి