ఇన్‌చార్జ్‌లే దిక్కు! | - | Sakshi
Sakshi News home page

ఇన్‌చార్జ్‌లే దిక్కు!

Oct 12 2025 7:59 AM | Updated on Oct 12 2025 7:59 AM

ఇన్‌చార్జ్‌లే దిక్కు!

ఇన్‌చార్జ్‌లే దిక్కు!

వేధిస్తున్న సబ్‌ రిజిస్ట్రార్ల కొరత

అనంతపురం టౌన్‌: స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో సబ్‌ రిజిస్ట్రార్ల కొరత వేధిస్తోంది. సీనియర్‌ అసిస్టెంట్లను ఇన్‌చార్జ్‌లుగా నియమించి నెట్టుకొస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 21 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలున్నాయి. వీటిల్లో ఆరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో సీనియర్‌ అసిస్టెంట్లతో రిజిస్ట్రేషన్ల పక్రియను కొనసాగిస్తున్నారు. అనంతపురంలోని రామ్‌నగర్‌ ప్రధాన కార్యాలయంలో ఇద్దరు రెగ్యులర్‌ సబ్‌ రిజిస్ట్రార్లు ఉండాల్సి ఉండగా ఒక్కరు సైతం లేకపోవడం గమనార్హం. దీంతో ఇటీవల రూరల్‌ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఇస్మాయిల్‌కు ఇన్‌చార్జ్‌ బాధ్యతలను అప్పటించారు. రూరల్‌ కార్యాలయంలో సైతం రెగ్యులర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ రెండు నెలల క్రితం పదవీ విరమణ చేశారు. అక్కడ సైతం ఇన్‌ చార్జ్‌ను నియమించారు. కళ్యాణదుర్గం, గుత్తి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో సీనియర్‌ అసిస్టెంట్లకు ఇన్‌చార్జ్‌ బాధ్యతలు ఇచ్చి రిజిస్ట్రేషన్‌ పక్రియను కొనసాగిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో సైతం ఇదే తంతు కొనసాగుతోంది. కదిరి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఇద్దరు రెగ్యులర్‌ సబ్‌ రిజిస్ట్రార్లు ఉండాల్సి ఉండగా ఒక్కరే ఉన్నారు. తనకల్లు, చిలమత్తూరు కార్యాలయాలకు రెగ్యులర్‌ సబ్‌ రిజిస్ట్రార్లు లేకపోవడంతో అనంతపురం కార్యా లయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్న ప్రసాద్‌బాబును ఇన్‌చార్జ్‌గా చిలమత్తూరుకు పంపారు. తనకల్లులో అక్కడే పని చేస్తున్న సీనియర్‌ అసిస్టెంట్‌కు బాధ్యతలు అప్పగించారు.

ప్రజలకు చుక్కలు..

రెగ్యులర్‌ సబ్‌ రిజిస్ట్రార్లు లేకపోవడంతో సీనియర్‌ అసిస్టెంట్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రిజిస్ట్రేషన్‌ సేవలను వినియోగించుకునేందుకు వచ్చే ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. చిన్న పనికి సైతం రోజుల తరబడి ప్రదక్షిణ చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి రెగ్యులర్‌ సబ్‌ రిజిస్ట్రార్లను నియమించాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయంపై స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ డీఐజీ విజయలక్ష్మీని వివరణ కోరగా.. ఆమె స్పందించారు. ఉమ్మడి జిల్లాలో 9 మంది కొత్త సబ్‌ రిజిస్ట్రార్ల అవసరం ఉందన్నారు. ఇదే విషయాన్ని రిజిస్ట్రేషన్‌ శాఖ డీఐజీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. అక్కడి నుంచి కొత్త ఎస్‌ఆర్‌లను కేటాయిస్తారన్నారు. ఆర్డర్‌ రాగానే ఖాళీగా ఉన్న కార్యాలయాలకు రెగ్యులర్‌ సబ్‌ రిజిస్ట్రార్లను నియమిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement