
వైద్య సిబ్బందిపై దాడికి యత్నం
● గుంతకల్లు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఘటన
గుంతకల్లుటౌన్: వైద్య సిబ్బందిపై ఓ రోగి, అతని సహాయకులు దాడికి యత్నించిన ఘటన గుంతకల్లు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో జరి గింది. గుంతకల్లు టూటౌన్ పోలీసులు తెలిపిన మేరకు.. శనివారం పట్టణంలోని సీఐటీయూ కాలనీ వద్ద ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇందులో గాయపడిన వినోద్ చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రి క్యాజువాలిటీ విభాగానికి వచ్చాడు. అతనికి సహాయకులుగా ఉషాకిరణ్, సుధా, నారాయణ వచ్చారు. ఈ క్రమంలోనే డాక్టర్ సల్మాన్‌జావెద్ గాయపడిన వినోద్‌ను తాను చూస్తానని, సహాయకులుగా ఉన్న వారు బయటకు వెళ్లాలని సూచించారు. దీంతో కోపోద్రిక్తులైన ఉషాకిరణ్, సుధాలు వైద్యుడిని అసభ్యకరంగా తిట్టారు. చొక్కా పట్టుకుని లాగారు. అడ్డుగా వెళ్లిన నర్సులు రామాంజినమ్మ, హసీనాలను కూడా అసభ్యపదజాలంతో దూషించారు. దీన్నంతటినీ చిత్రీకరిస్తున్న సెక్యూరిటీ గార్డు ప్రవీణ్‌ను అంతు తేలుస్తామంటూ బెదిరించారు. విషయం తెలుసుకున్న ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జయవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో వైద్యులు, నర్సులు, సిబ్బంది మొత్తం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సీఐ మస్తాన్‌కు ఫిర్యాదు చేశారు. డాక్టర్ సల్మాన్ జావెద్ ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, గాయపడిన వినోద్‌కు వైద్యం చేయకుండా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించినందుకే తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని రోగి సహాయకులు పేర్కొన్నారు.
భయంగా విధులు నిర్వర్తిస్తున్నాం
ప్రజలకు అనునిత్యం వైద్యసేవలందిస్తున్న తమకే రక్షణ లేకుండా పోతోందని ఆస్పత్రి నర్సులు ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యుడిపై దాడిని అడ్డుకున్నందుకు తమను అసభ్యకరంగా దూషించారని కన్నీళ్లు పెట్టుకున్నారు. రాత్రివేళ ఒక్కోసారి మద్యం సేవించి వచ్చే రోగి సహాయకులు బూతులు తిడుతున్నా గత్యంతరం లేక భరిస్తున్నామన్నారు. ఆస్పత్రి వద్ద మూత పడిన పోలీస్ ఔట్‌పోస్టును తెరిపించాలని వేడుకుంటున్నా పట్టించుకోవట్లేదని వాపోయారు.