రైతులను ఆదుకునే మనసు లేదా? | - | Sakshi
Sakshi News home page

రైతులను ఆదుకునే మనసు లేదా?

Oct 12 2025 7:45 AM | Updated on Oct 12 2025 7:45 AM

రైతులను ఆదుకునే మనసు లేదా?

రైతులను ఆదుకునే మనసు లేదా?

అనంతపురం:‘చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. ముఖ్యంగా జిల్లాలో కరువు ఛాయలు కమ్ముకున్నాయి. రైతుల కష్టాలు దయనీయంగా మారాయి’ అని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామి రెడ్డి అన్నారు. శనివారం ఆయన వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రైతుల కష్టాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ప్రజాప్రతినిధులకు చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. ఈ ప్రభుత్వంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదని, దీంతో రైతులు పండించిన పంటలను రోడ్లపై పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక గత ఏడాది ఖరీఫ్‌, రబీ సీజన్లలో పెద్ద ఎత్తున రైతులు నష్టపోయారన్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో తీవ్ర వర్షాభావం నెలకొని వారి వేదన వర్ణనాతీతంగా మారిందన్నారు. వేరుశనగ, పత్తి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని చెప్పారు.

గతంలో ఎప్పుడూ లేదు..

జిల్లాలో ప్రధాన పంట వేరుశనగ 4.50 లక్షల ఎకరాల్లో సాగవ్వాల్సి ఉన్నా కేవలం 2.25 లక్షల ఎకరాల్లో సాగు చేశారని గుర్తు చేశారు. ఆగస్టులో ఆలస్యంగా వర్షాలు కురిస్తే భూమి బీడు పెట్టలేక జొన్న, సజ్జ, కొర్రలు వేశారన్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో కేవలం 28 రెయినీడేస్‌ నమోదయ్యాయని, గతంలో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ తలెత్తలేదన్నారు. ఖరీఫ్‌లో సాగు చేసిన వేరుశనగ పంటకు ఇటీవల తెగుళ్లు ఆశించడంతో దిగుబడి కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. కేవలం వేరుశనగ సాగు కోసమే రైతులు రూ.450 కోట్ల పెట్టుబడి పెట్టారని, దిగుబడి కూడా రాకపోవడంతో వారికి నేడు దిక్కుతోచడం లేదన్నారు. సీజన్‌ ముగిసినా జిల్లాలో ఈ–క్రాప్‌ బుకింగ్‌ 50 శాతం కాకపోవడంతో ఇన్సూరెన్స్‌, ఇన్‌పుట్‌ సబ్సిడీపై నీలినీడలు కమ్ముకున్నాయని చెప్పారు. ఇప్పటికే 2023–24 ఇన్‌పుట్‌ సబ్సిడీ, వాతావరణ బీమా అందించలేదని, 2024–25లోనూ ఇన్‌పుట్‌, ఇన్సూరెన్స్‌ చెల్లించలేదని విమర్శించారు. ప్రస్తుత రబీ సీజన్‌లో పంటలు సాగు చేయడానికి రైతులు సన్నద్ధమవుతున్నా విత్తన పప్పుశనగ అందించకపోవడం దుర్మార్గమన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో పప్పుశనగను 40 శాతం సబ్సిడీతో అందిస్తే కూటమి ప్రభుత్వం వచ్చాక 25 శాతానికే పరిమితం చేశారని మండిపడ్డారు. అది కూడా గత ఏడాది 27 వేల క్వింటాళ్లకు పైగా విత్తన పప్పుశనగ కేటాయిస్తే ఈ ఏడాది 14 వేల క్వింటాళ్లకు కుదించి రైతులకు అన్యాయం చేశారన్నారు. సబ్సిడీ విత్తనాల కోసం రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్న దౌర్భాగ్య పరిస్థితులు తీసుకొచ్చారని మండిపడ్డారు. రైతులు అవస్థలు పడుతున్నా జిల్లాలో ప్రజాప్రతినిధులకు పట్టడంలేదని, లిక్కర్‌ షాపులు, కాంట్రాక్ట్‌లు చేసుకోవడానికే పరిమితమవుతున్నారని మండిపడ్డారు. ఇప్పటిదాకా కనీసం ఐఏబీ సమావేశం నిర్వహించలేదంటే రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వం రెండు, మూడు రోజుల్లో 40 నుంచి 50 శాతం సబ్సిడీతో పప్పుశనగ విత్తనాన్ని రైతుకు ఎంత అవసరం ఉంటే అంత పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. పెట్టుబడి సాయం కూడా అందజేయాలని కోరారు. నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించి వైద్య సేవలు సజావుగా సాగేలా చూడాలన్నారు. ఆరోగ్యశ్రీ అంటే డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ పేరు గుర్తుకొస్తుందన్న భయంతో పథకాన్ని చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వెన్నం శివారెడ్డి, కల్చరల్‌ విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు కేశవ రెడ్డి, రైతు విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు నాగేశ్వర రెడ్డి పాల్గొన్నారు.

కరువు రక్కసితో

అన్నదాతల కుదేలు

ఇన్‌పుట్‌, ఇన్సూరెన్స్‌

అందించడంలో

ప్రభుత్వం విఫలం

ఇప్పటిదాకా కనీసం ఐఏబీ సమావేశం నిర్వహించలేదు

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామి రెడ్డి ధ్వజం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement