
మందలించారని యువకుడి ఆత్మహత్య
రాప్తాడు: ఇంట్లో మందలించారని మనస్తాపం చెంది ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ధర్మవరం రైల్వే పోలీసులు, మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.... అనంతపురం రూరల్ మండలం ఆకుతోటపల్లికి చెందిన రాము, లక్ష్మీదేవి దంపతులు. పదేళ్ల క్రితం రాము మృతి చెందాడు. అప్పటి నుంచి కుమారుడు కులవర్దన్ (21) వ్యవసాయ పనులతో పాటు తల్లితో కలిసి పాడి ఆవులు పెట్టుకుని కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇదిలా ఉండగా ఏడాది కిత్రం అప్పు చేసి రూ.లక్ష విలువైన బైక్ కొనుగోలు చేశాడు. వీటిని తీర్చలేక, పనులకు వెళ్లకపోవడంతో ఇంట్లో మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన కులవర్దన్ శనివారం గంగులకుంట గ్రామ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే కీమెన్ సమాచారంతో ధర్మవరం రైల్వే పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, మృతుని వద్ద దొరికిన సెల్ ఫోన్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుతాసుపత్రికి తరలించారు.