
పాపం జయరంగారెడ్డి..
● రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స కోసం అవస్థలు
● ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిపివేయడంతో సకాలంలో అందని వైద్యం
పుట్లూరు: నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోవడంతో సకాలంలో వైద్యం అందక పేదలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెల పదో తేదీన ఉపాధి హామీ పనుల కోసం వెళుతున్న సమయంలో తూఫాన్ వాహనం ఢీకొనడంతో గోపురాజుపల్లికి చెందిన జయరంగారెడ్డి, వసంత గాయపడ్డారు. వీరిలో జయరంగారెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కూలి పనులకు వెళ్లి జీవనం సాగించే జయరంగారెడ్డి కుంటుంబంలో ఇప్పటికే భార్య కంటి ఆపరేషన్ చేయించుకోగా, కుమారుడు రాజారెడ్డి నెల రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స తీసుకుంటున్నాడు. ఇలాంటి సమయంలో అండగా ఉన్న జయరంగారెడ్డి రోడ్డు ప్రమాదంలో కాలు విరగడంతో ఆ కుటుంబంలో అంధకారం నెలకొంది. ఇదే సమయంలో ఎన్టీఆర్ వైద్య సేవలను ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పలు నిలిపివేయడంతో సకాలంలో మెరుగైన వైద్యం అందలేదు. గాయపడిన జయరంగారెడ్డిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే కాలు విరగడంతో పాటు నరాలు తెగిపడటం వల్ల సర్జరీ చేయడానికి న్యూరో సర్జన్ అందుబాటులో లేరనే కారణంతో చికిత్స ఆలస్యమౌతోంది. రోజులు గడిస్తే కాలు తొలగించాలని వైద్యులు చెబుతుండటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రైవేటుగా వైద్యం చేయించేందుకు ఆపన్నహస్తం కోసం అర్థిస్తున్నారు. ప్రత్యేక సహాయ నిధితో జయరంగారెడ్డిని ఆదుకోవాలని గోపురాజుపల్లి గ్రామస్తులు కోరుతున్నారు.