
భర్త, కుమారుడి ఆచూకీ తెలపండి
యాడికి: ‘యాడికి పోలీసులు న్యాయం చేయలేదు. నా భర్త, కుమారుడి ఆచూకీ తెలిపి మీరైనా న్యాయం చేయండి’ అంటూ తాడిపత్రి ఏఎస్పీ రోహిత్‌కుమార్ చౌదరి వద్ద లక్ష్మిదేవి అనే మహిళ శనివారం మొరపెట్టుకుంది. వివరాలు.. ఈ నెల 8వ తేదీన యాడికి మండలం వెంగన్నపల్లికి చెందిన లక్ష్మిదేవి పట్ల అదే గ్రామానికి చెందిన విశ్వనాథ అనే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. విషయాన్ని లక్ష్మిదేవి తన భర్త నారాయణ స్వామి, పెద్ద కుమారుడు నవీన్‌కు చెప్పింది. వారు విశ్వనాథ ఇంటికి వెళ్లి నిలదీయడంతో గొడవ జరిగింది. అనంతరం విశ్వనాథ తన నలుగురు సోదరులతో కలిసి లక్ష్మిదేవి ఇంటిపై దాడి చేశారు. దీనిపై ఫిర్యాదు చేయడానికి లక్ష్మిదేవి, నారాయణ స్వామి, నవీన్ బయలు దేరుతుండగా ఇద్దరు పోలీసులు వచ్చి అడ్డుకున్నారు. అనంతరం అదేరోజు సుమారు 10 మంది పోలీసులు వచ్చి ముగ్గురినీ పోలీస్టేషన్‌కు తీసుకెళ్లారు. లక్ష్మిదేవిని అర్ధరాత్రి ఇంటికి పంపారు. గొడవ జరిగిన నేపథ్యంలో ఆమె తన సొంతూరికి వెళ్లకుండా తన బంధువులైన వీరన్నపల్లికి చేరుకుంది. పోలీసులు నారాయణ స్వామి, నవీన్‌ను మూడు రోజులైనా ఇంటికి పంపలేదు. పైగా నారాయణ స్వామి, లక్ష్మిదేవి, నవీన్‌తో పాటు మరి కొంతమందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. లక్ష్మిదేవి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. లక్ష్మిదేవిని కూడా మూడు రోజుల పాటు పోలీస్‌స్టేషన్ చుట్టూ తిప్పారు. ఈ క్రమంలో శనివారం తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి యాడికి పోలీసుస్టేషన్‌కు లక్ష్మిదేవిని పిలిపించి జరిగిన సంఘటనపై విచారణ చేశారు. తనకు, తన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని, పోలీసుల తీరును ఏఎస్పీకి లక్ష్మిదేవి వివరించి న్యాయం చేయాలని వేడుకుంది. ఘటనపై సమగ్ర విచారణ చేస్తామని లక్ష్మిదేవికి ఏఎస్పీ భరోసా ఇచ్చారు.