
డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె
అనంతపురం మెడికల్: తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చే వరకు సమ్మె కొనసాగుతుందని పీహెచ్‌సీ వైద్యులు స్పష్టం చేశారు. డిమాండ్ల సాధన కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ) వైద్యులు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద చేపట్టిన రిలే దీక్షలు ఏడో రోజు శనివారం కొనసాగాయి. పీహెచ్‌సీ వైద్యుల అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ తమ న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం తేలిగ్గా తీసుకుందని మండిపడ్డారు. పీజీ మెడికల్ కోర్సుల్లో ఇన్ సర్వీస్ కోటా క్లినికల్ విభాగంలో 20 శాతం బ్రాంచ్‌లో కొనసాగించాలన్నారు. అలాగే చంద్రన్న సంచార చికిత్స కార్యక్రమానికి సంబంధించి అలవెన్స్‌లు ఇవ్వాలన్నారు. పెండింగ్‌లో ఉన్న నోషనల్ ఇంక్రిమెంట్స్ మంజూరు చేయాలన్నారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు సమ్మెను ఆపేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు డాక్టర్ శివసాయి, డాక్టర్ ఇందిరా ప్రియదర్శిని, డాక్టర్ శివకృష్ణ పాల్గొన్నారు.
విద్యుత్ షాక్‌తో కార్మికుడి మృతి
కుందుర్పి: విద్యుత్ కార్యాలయం వద్ద మరమ్మతులు చేస్తున్న కార్మికుడు ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతంతో మృతి చెందాడు. విద్యుత్ శాఖ, పోలీసు అధికారులు తెలిపిన మేరకు... తాడిపత్రికి చెందిన రమేష్ అనే కాంట్రాక్టర్ కుందుర్పిలో వైఎస్సార్ కడప జిల్లా కొండాపురం గ్రామానికి చెందిన జనార్ధనాచార్యులు (34)తో శనివారం విద్యుత్ కార్యాలయంలో మరమ్మతులు చేయిస్తున్నాడు. ఉన్నట్టుండి విద్యుత్ షాక్‌కు గురవడంతో మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
చికిత్స పొందుతూ
ఆర్టీటీ ఉద్యోగి మృతి
రాప్తాడురూరల్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న ఎకాలజీ సెంటర్ ఉద్యోగి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... ఎకాలజీ సెంటర్ పరిధిలోని కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నాగరాజు (45) ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. ఈ నెల 7న పంగల్ రోడ్డు వైపు బైకులో వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ నాగరాజును సర్వజనాస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో బెంగళూరుకు తరలించారు. అక్కడి వైద్యులు పరిస్థితి చేజారిందని తేల్చారు. ఈ క్రమంలో తిరిగి అక్కడి నుంచి అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించగా...చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఈయన భార్య సుచరిత బెళుగుప్ప జెడ్పీ హైస్కూలులో గణితం టీచరుగా పని చేస్తున్నారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నాగరాజు మృతి బాధాకరమని ఎంపీపీ కమలమ్మ, సర్పంచులు అతావుల్లా, బొమ్మయ్య, ఓబన్న పేర్కొన్నారు.

డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె