
వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే వరకూ పోరాటం
● ఏపీ వాల్మీకి బోయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు క్రాంతినాయుడు
అనంతపురం రూరల్: వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వం దగా చేసిందని ఏపీ వాల్మీకి బోయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు క్రాంతినాయుడు మండిపడ్డారు. డిమాండ్ సాధనలో భాగంగా బుధవారం ఏపీ వాల్మీకి, బోయ సంఘం జిల్లా అధ్యక్షుడు మాధవయ్య ఆధ్వర్యంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసుల ఇళ్ల ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. రుద్రంపేటలోని వాల్మీకి భవన్ నుంచి ర్యాలీగా బయలుదేరిన నాయకులను పోలీసులు అడ్డుకుని నాల్గో పట్టణ పీఎస్‌కు తరలించారు. ఈ సందర్భంగా క్రాంతినాయుడు మాట్లాడారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాల్మీకులను ఎస్టీ జాబితాలోకి చేర్చే వరకూ తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి నరేష్, శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షుడు రమేష్, నాయకులు మేకల శివ, నాగేంద్ర, బాలకృష్ణ పాల్గొన్నారు.