‘మమ్మల్ని క్షమించు దేవుడా’.. దోచేసిన సొమ్ముతో పాటు లేఖను వదిలేసిన దొంగలు | Temple Theft In Anantapur Ends With Repentance And Return Of Stolen Money, More Details Inside | Sakshi
Sakshi News home page

‘మమ్మల్ని క్షమించు దేవుడా’.. దోచేసిన సొమ్ముతో పాటు లేఖను వదిలేసిన దొంగలు

Sep 5 2025 11:52 AM | Updated on Sep 5 2025 12:17 PM

Temple Theft in Anantapur Ends with Repentance and Return of Stolen Money

సాక్షి,అనంతపురం: దొంగలు దేవుడికి భయపడ్డారు. తప్పైపోయింది. మమ్మల్ని క్షమించు దేవుడా అంటూ దోచేసిన సొమ్ముతో పాటు ఓ లేఖను విడుదల చేశారు. 

నెలరోజుల క్రితం ప్రముఖ బుక్కరాయసముద్రం శ్రీ శ్రీ ముసలమ్మ పుణ్యక్షేత్రంలో హుండీ చోరీ జరిగింది. ఈ క్రమంలో దోచేసిన నగదును మళ్లీ ఆలయ ఆవరణలో వదిలేసి వెళ్లిపోయారు. అందుకు గల కారణాల్ని వివరిస్తూ డబ్బుతో పాటు ఓ లేఖను విడుదల చేశారు.

‘దొంగతనం చేసిన నాటి నుంచి ఇంట్లో పిల్లలకు ఆరోగ్యం బాగా లేదు. తప్పు తెలుసుకుని డబ్బు తిరిగి ఇచ్చేస్తున్నాం. కొడుకు హాస్పిటల్‌ ఖర్చుల కోసం డబ్బును వాడుకున్నాం. క్షమించండి’ అంటూ ఆ లెటర్‌లో పేర్కొన్నారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో దొంగిలించిన  సొమ్ము రూ.లక్షా 86 వేలుగా ఆలయ అధికారులు లెక్కతేల్చారు. హుండీని చోరీ చేసింది ఎవరు? అనేది తేలాల్సి ఉంది.

ముసలమ్మ దేవాలయానికి సుదీర్ఘ చరిత్ర
ఇక దొంగతనం జరిగిన ముసలమ్మ దేవాలయానికి సుదీర్ఘ చరిత్ర ఉండటంతో చర్చకు దారితీసింది. ముసలమ్మ ఆలయానికి సుదీర్ఘ చరిత్రనే ఉంది. మూడు శతాబ్దాల క్రితం బుక్కరాయసముద్రం చెరువు నిండి ఉప్పొంగి కట్టకు భారీగా గండిపడింది. దీంతో చెరువులోని నీరంతా గ్రామంలోకి చొరబడి మునిగిపోతుండగా గ్రామస్తులు గ్రామ సమీపంలో ఉన్న పోలేరమ్మ తల్లిని ప్రార్థించారు. ఆ సమయంలో ‘గ్రామంలో ఉన్న బసిరెడ్డి చిన్నకోడలు ముసలమ్మ ప్రాణత్యాగంతో కట్ట నిలుస్తుంది’ అనే మాటలు వినిపించడంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. విషయం తెలుసుకున్న ముసలమ్మ దేవుడిని ప్రార్థిస్తూ గండి పడిన చోట చెరువులోకి దూకింది. దీంతో వరద నీరు నిలిచిపోయిందట. అప్పటి నుంచి ముసలమ్మను ఇలవేల్పుగా గ్రామస్తులు పూజిస్తూ వస్తున్నారు. ప్రజా సంక్షేమాన్ని ఆకాంక్షించి ప్రాణత్యాగం చేసిన ముసలమ్మకు ప్రత్యేకంగా ఆలయాన్ని నిర్మించి నిత్య పూజలు చేస్తూ వస్తున్నారు. అనంతరం కాలంలో రూ.3 కోట్లు వెచ్చించి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement