
●కలలు మావైనా.. సాకారం ఆయనతోనే
సాధారణంగా టీచర్లు పిల్లలకు పాఠాలు నేర్పుతారు. కానీ ఈ గురువు పాఠాలతో పాటు విద్యార్థుల జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నారు. ఆయనే తాడిపత్రి పట్టణంలోని శ్రీ సుధా శ్రీరాములు మెమోరియల్ మునిసిపల్ హైస్కూల్‌లో పని చేస్తున్న హిందీ పండిట్ కె.సుకుమార్. ఈయన పని చేసిన ప్రతిచోటా చదువులో ఆసక్తి చూపే విద్యార్థులను గుర్తించి, ఆర్థిక ఇబ్బందులతో వారు వెనకడుగు వేయకూడదని భావించి ఆర్థిక అండగా నిలుస్తూ వారి చదువులకు భరోసా ఇస్తున్నారు. తన జీతంలో కొంత మేరకు డబ్బు వారికోసం ఖర్చు చేస్తూ అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నారు. చదువు పూర్తయిన తర్వాత కూడా వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు తనవంతు సహకారం అందిస్తున్నారు. ఇలా ఈయన ఇచ్చిన చేయూతతో చదువుకున్న పలువురు విద్యార్థులు నేడు మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. సుకుమార్ చేయూతతో విద్యార్థి పి. రాజు – 2017లో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్‌గా ఎంపికై ప్రస్తుతం అనంతపురం పట్టణ ప్రణాళిక ప్రాంతీయ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు. పి. చెండ్రాయుడు 2022లో ఉద్యోగం సాధించి, ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర గ్రామీణ బ్యాంక్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. డీఎస్సీ–2025 ఎస్. ఇంజు స్కూల్ అసిస్టెంట్ (ఫిజిక్స్), ఎస్‌జీటీ రెండు పోస్టులకు ఎంపికయ్యాడు. ఎస్.కె. షరీఫ్ ఎస్‌జీటీ ఉద్యోగం సాధించాడు. ‘మా జీవితాల్లో మార్పు తీసుకువచ్చింది మా కుటుంబం మాత్రమే కాదు. మా గురువు సుకుమార్ సర్ కూడా. ఆయన లేకపోతే చదువు మధ్యలో వదిలేసేవాళ్లం’ అని ఆ శిష్యులు చెబుతున్నారు. విజయాలు సొంత కృషితోనే అయినా, ఆ కృషికి దిశ, బలం ఇచ్చింది సుకుమార్ సార్ అని గర్వంగా చెబుతున్నారు. సుకుమార్‌తో పాటు సైన్స్ టీచర్ కె. రామకృష్ణ, తెలుగు టీచరు మల్లికార్జున తమను వెన్నుతట్టి ప్రోత్సహించారని గుర్తు చేసుకుంటున్నారు.