
మనిషిని కుక్క కరిస్తే వార్త కాదు.. కుక్కని మనిషి కరిస్తే కదా వార్త అని మనం అంతా అనుకుంటూ ఉంటాం. ఇది కూడా అలాంటిదే. దొంగలు దోచుకుంటే అది వార్త కాదు. ఇవాళ్టి రోజుల్లో అయితే దొంగలు దొరికినా కూడా వార్త కాదు. టెక్నాలజీ చాలా మందిని పట్టిచ్చేస్తోంది. కానీ దొంగలు దోచుకున్న సొమ్మును తిరిగి తెచ్చి, దొంగచాటుగా, అప్పగించేసి, లెంపలు వాయించుకుని, క్షమాపణ కోరుతూ ఓ ఉత్తరం కూడా విడిచి వెళ్లారంటే మాత్రం అది వార్తే. ఆ యవ్వారంలో ఏదో కొంత స్ఫూర్తి ఉన్నదని గ్రహించాల్సిందే. ఆ స్ఫూర్తిని టన్నుల కొద్దీ కొనుగోలు చేసి.. మన రాజకీయ నాయకులందరికీ కానుకలుగా పంపాలని కంకణం కట్టుకోవాల్సిందే.
ఇంతకీ ఏమిటీ తమాషా అనుకుంటున్నారా?.. అనగనగా బుక్కరాయసముద్రంలో ముసలమ్మ పుణ్యక్షేత్రం ఉంది. సాధారణంగా గ్రామదేవతలు అత్యంత మహిమాన్వితులుగా స్థానికులు నమ్ముతుంటారు కదా.. అక్కడ కూడా ముసలమ్మ మహిమల్ని అదేవిధంగా నమ్ముతుంటారు. కానీ.. కొన్ని రోజుల కిందట ముసలమ్మ పుణ్యక్షేత్రంలో దొంగలు పడి హుండీ చోరీ చేశారు. ఒకవైపు పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. ఈలోగా.. ఆలయ ఆవరణలోనే దోచిన సొమ్మునంతా తెచ్చిపెట్టేసి, దానితో పాటు ఓ ఉత్తరం కూడా పెట్టి.. గుట్టుచప్పుడు కాకుండా వెళ్లిపోయారు.
హుండీ సొమ్ము దొంగిలించిన కాణ్నించీ.. మా యింట్లో పిల్లలకి ఆరోగ్యం బాగా లేదు. ముసలమ్మ సొమ్ము దొంగిలించి తప్పు చేశాం. అందుకే తిరిగి యిచ్చేస్తున్నాం. ఆస్పత్రి ఖర్చులకు అయిన డబ్బు మాత్రం వాడుకున్నాం. క్షమించండి.. అని ఆ ఉత్తరంలో వారు వాక్రుచ్చారు. పోలీసులు తిరగొచ్చిన సొమ్మును లెక్కవేస్తే 1.86 లక్షల రూపాయల దాకా తేలింది. దొంగలెవరో కనిపెట్టాలని వెతుకుతున్నారు.

పాపం.. ఆ ముసలమ్మ హుండీ దొంగల పశ్చాత్తామని, పాపభీతిని పక్కన పెడదాం. సొమ్ము తిరిగి ఇవ్వడం ద్వారా వారిలోని స్ఫూర్తిని మాత్రం పట్లించుకుందాం. ఈ వార్త చదివితే.. ఈ దొంగల స్ఫూర్తి మన రాజకీయ నాయకులకు ఉంటే ఎంత బాగుంటుంది కదా.. అని మనకు అనిపిస్తుంది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అధికారం దక్కింది.. ఉన్న కాడికి దోచెయ్యాలి.. జీవితంలో మళ్లీ అధికారం అనేది మన దాకా వస్తుందో రాదో అన్నట్టుగా దోపిడీ చేస్తున్న కూటమి పార్టీ నాయకుల వ్యవహారం ప్రజలకు కంపరం పుట్టిస్తోంది.
పబ్లిక్ టాక్ ఏంటంటే..
ఏపీలో ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా దోచుకుంటూ ఉంటే.. చేతగాని ప్రేక్షకుడిలాగా చూస్తూ ఊరుకుంటున్న అధినాయకుడు మాత్రం.. అప్పుడప్పుడూ రంకెలు వేస్తూ.. ‘లేస్తే మనిషిని కాదు.. ఖబడ్దార్’ అంటూ ఉంటారు. ఒకవైపు హామీల అమలులో విఫలమై.. ప్రజాసందోహంలో పరువు పోగొట్టుకుంటున్న కూటమి నాయకుల్లో.. మళ్లీ ఎన్నికలంటూ వస్తే మనం ఎటూ గెలవం అనే భయమే వారిని దోపిడీ వైపు ప్రేరేపిస్తోందని ప్రజలు అనుకుంటున్నారు.

అమరావతి నిర్మాణానికి మొబిలిటీ అడ్వాన్సుల ముసుగులో దోచుకున్న వందల వేల కోట్ల రూపాయలు, లిక్కర్ దుకాణాల్ని అయినవారికి కట్టబెట్టి సిండికేట్లుగా దోచుకుంటున్న మొత్తాలు, ఇసుక ఉచితం పేరుతో అడ్డగోలుగా దోచుకుంటున్న వాటితో ప్రారంభించి.. అవకాశం ఉన్న ప్రతి వ్యవహారంలోనూ ఆమ్యామ్యాలతో రెచ్చిపోతున్న నాయకుల్లో ఇలాంటి పశ్చాత్తాపం రావాలంటే.. వారికోసం ఎంత పవర్ ఫుల్ దేవుళ్లు... వారికి ఎన్ని ఇక్కట్లు సృష్టించాలో కదా అని ప్రజలు అనుకుంటున్నారు. ఈ నాయకులు దోచుకుంటున్న సొమ్ముల్లో వాడుకున్నది పోగా.. దేవుళ్ల మహిమతో, ముసలమ్మ దొంగల స్ఫూర్తితో మిగిలింది తిరిగి ఇచ్చినా కూడా.. ఒక అమరావతి కాదు కదా.. పది అమరావతిలు, పది పోలవరం డ్యాములు కట్టవచ్చునని ప్రజలు అంటున్నారు.
అయినా.. దొంగలకు ఉండే స్ఫూర్తి ఈ నాయకులకు ఎందుకుంటుంది? దొంగలు చాలా గొప్పవాళ్లు కదా? అవసరం కోసం దోచుకునే వారికి ఉండే న్యాయం, బుద్ధి.. అరాచకం కోసం దోచుకునే నాయకుల్లో ఆశించడం కూడా తప్పే కదా.. అని కొందరు పెదవి విరుస్తున్నారు.
:::ఎం.రాజేశ్వరి