
రైతులను కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి
అనంతపురం అగ్రికల్చర్: రైతు ఇంట ఉల్లి కన్నీరు తెప్పిస్తోంది. కోతకు వచ్చిన సమయంలో గిట్టుబాటు ధరలు లేక అల్లాడిపోతున్న పరిస్థితి నెలకొంది. ధరలు నేలచూపులు చూస్తున్నందున రైతులు భారీ నష్టాలు చవిచూస్తున్నారు. ఈ ఖరీఫ్‌లో జిల్లాలోని రాయదుర్గం ప్రాంతంలో 600 ఎకరాలు, మిగతా ప్రాంతంలో మరో 600 నుంచి 700 ఎకరాల్లో ఉల్లి సాగు చేశారు. ఎకరాకు రూ.40 వేల నుంచి రూ.50 వేల ఖర్చు చేశారు. కోతకు వచ్చిన సమయంలో ధరలు పతనం కావడంతో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. వర్షాలు పడుతున్న నేపథ్యంలో పంట కోత, నూర్పిడి, అరబెట్టేందుకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎకరాకు గరిష్టంగా 50 క్వింటాళ్ల వరకు దిగుబడులు వస్తున్నా.. క్షేత్రస్థాయిలో క్వింటా రూ.500 పలకడం కూడా గగనంగా మారింది.
క్వింటా రూ.1,200 ప్రకారం కొనాలి.. : పెట్టుబడి కూడా చేతికిరాక అన్నదాత నష్టపోతున్నా... కూటమి సర్కారు చోద్యం చూస్తోంది. కర్నూలు, బళ్లారి మార్కెట్లకు వెళదామన్నా రానుపోనూ ఖర్చులు కూడా వెనక్కివచ్చే పరిస్థితి లేక రైతులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఉద్యానశాఖ అధికారులు పరామర్శించడం మినహా సాయం చేయలేని పరిస్థితిల్లో ఉన్నారు. గురువారం ఉద్యాన శాఖ డీడీ డి.అనురాధ రాయదుర్గం ప్రాంతంలో పర్యటించి ఉల్లి రైతుల స్థితిగతులు తెలుసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కనీస మద్ధతు ధర (ఎంఎస్‌పీ) క్వింటా రూ.1,200 ప్రకారం ప్రభుత్వం తరఫున కొనుగోలు చేస్తే కనీసం పెట్టుబడులైనా దక్కుతాయని రైతులు పేర్కొన్నారు.
గురుకులంలో అక్రమాలపై కమిషనర్ సీరియస్
ఉరవకొండ: వజ్రకరూరు మండలం రాగులపాడు బాలుర గిరిజన గురుకుల పాఠశాలలో ఇటీవల హాజరు నమోదులో జరిగిన అక్రమాలపై గురుకులాల రాష్ట్ర కమిషనర్ గౌతమి సీరియస్ అయ్యారు. ‘హాజరు కనికట్టు.. బిల్లులు కొల్లగొట్టు’ శీర్షికన ఈనెల 1న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై ఆమె స్పందించారు. విచారణ చేసి 24 గంటల్లో పూర్తి స్థాయిలో నివేదిక అందచేయాలని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాసరావును ఆదేశించారు. దీంతో పాటు గురుకులానికి ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్‌గా ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని ఎలా నియమిస్తారంటూ ప్రశ్నించారు. గురుకులంలో పని చేసే హెడ్ కుక్ వారం రోజుల నుంచి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఎలా వెళ్తాడని, అతని స్థానంలో ప్రవేట్ వ్యక్తిని పెట్టుకుంటే విద్యార్థులకు నాణ్యమైన భోజనం ఎలా అందుతుందని కూడా మండిపడ్డారు.