
చాలా జాగ్రత్తలు పాటించాలి
గుంతకల్లు టౌన్: వాతావరణంలో మార్పుల మాట ఎలా ఉన్నా.. గుంతకల్లులో లోపించిన పారిశుధ్యం కారణంగా విష జ్వరాలతో బాధపడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. జ్వర పీడితులతో ప్రభుత్వ ఏరియా, అర్బన్ హెల్త్ సెంటర్లతో పాటు ప్రైవేట్ ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ నిర్వహణ లోపం కారణంగా గత ఇరవై రోజులుగా వరుసగా కురిసిన వర్షాలతో ఎటు చూసినా నీరు నిల్వ ఉండిపోయింది. దీనికి తోడు దోమలు విపరీతంగా వృద్ధి చెందాయి. గత ప్రభుత్వంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిర్వహణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కే ఆదర్శంగా నిలిచిన గుంతకల్లు మున్సిపాల్టీలో ప్రస్తుతం అధ్వాన పరిస్థితులు నెలకొన్నాయి. పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని కౌన్సిల్ సమావేశాల్లో సభ్యులు గగ్గోలు పెడుతున్నా.. అధికారులు స్పందించడం లేదనే విమర్శలున్నాయి.
చిన్నారులే అత్యధికంగా...
గుంతకల్లు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో రోజూ 650 నుంచి 700 మంది వరకు ఓపీ నమోదవుతోంది. గత 20 రోజులుగా ఔట్ పేషెంట్లల్లో సుమారు 35 శాతం మంది జ్వరపీడితులే ఉంటున్నారు. వీరిలో టైఫాయిడ్, దగ్గు, జలుబు, గొంతునొప్పితో బాధపడుతున్న వారే అఅత్యధికంగా ఉన్నట్లు ఆస్పత్రి రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో చిన్నపిల్లలే ఎక్కువగా ఉండడం ఆందోళన కరం. బుధవారం ఇన్ పేషెంట్‌గా చికిత్స పొందుతున్న 60 మందిలో 40 మంది జ్వరంతో బాధపడుతున్న వారు కాగా, వీరిలో 25 మంది చిన్నారులు ఉన్నారు. దీంతో ఆస్పత్రిలోని మూడు ఎంఎల్, చిన్నారుల వార్డులు జ్వరపీడితులతో నిండిపోయాయి. ఆస్పత్రిలోని ల్యాబ్‌లో రోరజూ 80 నుంచి 120 మందికి రక్తపరీక్షలు నిర్వహిస్తున్నారు. వీరిలో 35 నుంచి 40 వైరల్ ఫీవర్ కేసులు బయటపడుతున్నాయి. గుంతకల్లులోని నాలుగు అర్బన్ హెల్త్ సెంటర్లల్లోనూ ఇదే పరిస్థితి. చిన్నపిల్లల ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యులు ఉదయం 10 నుంచి రాత్రి 12 గంటల వరకు ఎడతెరపి లేకుండా వైద్యమందిస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
గుంతకల్లులోని ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులు
జ్వర పీడితులతో కిక్కిరిస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు
ఓపీలో 35 శాతం జ్వర పీడితులే
ఈ సీజన్‌లో పిల్లల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు పాటించాలి. వాతావరణ మార్పుల కారణంగా విష జ్వరాలు పెరిగిపోతున్నాయి. 20 రోజులుగాటైఫాయిడ్, దగ్గు, జలుబు, గొంతునొప్పి కేసులే ఎక్కువగా వస్తున్నాయి. ప్రధానంగా ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. నీరు నిల్వ ఉంటే దోమలు వ్యాప్తి చెంది జ్వరాల బారిన పడే ప్రమాదముంది. జ్వరం అధికంగా ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలి.
– డాక్టర్ శ్రీనివాసయాదవ్,
గుంతకల్లు