
భారత క్రికెట్ జట్టులో స్థానమే అంతిమ లక్ష్యం కావాలి
అనంతపురం: భారత క్రికెట్ జట్టులో స్థానం దక్కించుకోవడమే అంతిమ లక్ష్యంగా శ్రమించాలని క్రికెటర్లకు కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియంలో బుధవారం ఆంధ్రాక్రికెట్ అసోసియేషన్ అండర్–19 క్రికెట్ టోర్నీ ప్రారంభమైంది. కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ఆంధ్రా ప్రెసిడెంట్, బరోడా జట్ల మధ్య మ్యాచ్‌ను ప్రారంభించి, మాట్లాడారు. క్రీడలకు ఆర్డీటీ నిలయంగా మారడం గర్వకారణమన్నారు. క్రికెట్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో అనంతపురం జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు ప్రకాష్ రెడ్డి, కార్యదర్శి భీమలింగా రెడ్డి, వెటరన్స్ క్రికెట్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మచ్చా రామలింగా రెడ్డి, ఏసీఏ జూనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్ అచ్యుతరావు, సెలెక్టర్ లీలా మోహన్‌రెడ్డి, ట్రెజరర్ షబ్బీర్ అహమ్మద్, మాజీ రంజీ ప్లేయర్ సురేష్, ఏడీసీఏ సభ్యులు చంద్రమోహన్‌రెడ్డి, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఆసక్తిగా తొలి రౌండ్ మ్యాచ్‌లు
తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో బరోడా, ఆంధ్రా సెక్రెటరీ జట్టు గెలిచాయి. ఆంధ్రా సెక్రెటరీ, మధ్యప్రదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిమధ్యప్రదేశ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆంధ్రా సెక్రెటరీ జట్టు 40.4 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. ఈశ్వర్ రిత్విక్ 78 పరుగులు, పి.సిద్ధు కార్తీకర్ రెడ్డి 67 పరుగులు సాధించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్ జట్టు 48.1 ఓవర్లలో 217 పరుగులకు ఆలౌట్ అయింది. ఆంధ్రా ప్రెసిడెంట్ , బరోడా జట్ల మధ్య జరిగిన రెండో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్రా ప్రెసిడెంట్ జట్టు 46.5 ఓవర్లలో పది వికెట్ల నష్టానికి 235 పరుగులు సాధించింది. కోగటం హనీష్ వీరారెడ్డి 68 బంతుల్లో 97 పరుగులు సాధించాడు. అనంతరం బ్యాటింగ్ బరిలో దిగిన బరోడా జట్టు కేవలం 38.1 ఓవర్లలోనే నాలుగు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. జట్టులో విశ్వాస్ పటేల్ 82 బంతుల్లో 105 పరుగులు సాధించాడు.
కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్