
హక్కుల సాధనకు ఉద్యమించాలి
అనంతపురం అర్బన్: హక్కుల సాధనకు ఏకమై ఉద్యమించాలని మహిళలకు ఐద్వా కేంద్ర కమిటీ సభ్యురాలు పుణ్యవతి పిలుపునిచ్చారు. బుధవారం అనంతపురంలోని లలితకళాపరిషత్‌లో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు శ్యామల అధ్యక్షతన జిల్లా మహాసభలు జరిగాయి. పుణ్యవతితో పాటు రాష్ట్ర కోశాధికారి సావిత్రి, డాక్టర్ ప్రసూన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సమాజంలో మహిళలు సగభాగం ఉన్నా.. వారు ఎదుర్కొంటున్న సమస్య పరిష్కారంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడ్డారు. మహిళలపై వివక్ష, అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మైక్రో ఫైనాన్స్ ఆగడాల నుంచి మహిళలకు రక్షణ కల్పించాలన్నారు. మహిళలపై ఆత్యాచారాలు, దాడులు, లైంగిక వేధింపులు, గృహహింస నిత్యకృత్యమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆగడాలకు మద్యం, మత్తు పదార్థాలు కూడా కారణమన్నారు. ప్రతి మహిళ చైతన్యవంతమైన హక్కుల కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకురాళ్లు చంద్రిక, అశ్విని, శంసాద్, రామాంజినమ్మ, సుజాత, తదితరులు పాల్గొన్నారు.
నూతన కార్యవర్గం ఎన్నిక
ఐద్వా జిల్లా మహాసభల్లో 13 మందితో కూడిన జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఐద్వా జిల్లా అధ్యక్షురాలిగా శ్యామల, కార్యదర్శిగా చంద్రిక, కోశాధికారిగా అశ్విని, కార్యదర్శివర్గ సభ్యులుగా షంషాద్, రామాంజినమ్మ, సుజాత, గీత, శైలజ, రేణుక, రంగమ్మ, కృష్ణవేణి, లక్షమ్మదేవి, నడిపక్క ఎన్నికయ్యారు. జిల్లా కమిటీ సభ్యులుగా 26 మందిని ఎన్నుకున్నారు.
మహిళలకు ఐద్వా కేంద్ర కమిటీ సభ్యురాలు పుణ్యవతి పిలుపు