
పేరుకుపోతున్న చెత్తాచెదారం
గుంతకల్లు పట్టణంలో ఎటు చూసినా చెత్తాచెదారం పేరుకుపోయింది. గత ప్రభుత్వ హయాంలో ఆటోల ద్వారా చెత్త సేకరణ సక్రమంగా జరిగేది. ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం ఆ ఆటోలు తిరగట్లేదు. ఉన్న అరకొర ట్రాక్టర్లు, నాలుగైదు ఆటోలతో వారానికి రెండు లేదా మూడుసార్లు మాత్రమే చెత్త సేకరిస్తున్నారు. ఇక డ్రైనేజీల్లో పూడిక తీయకపోవడంతో పాటు పైప్‌లైన్ ఏర్పాటు పేరిట రోడ్లను ధ్వంసం చేయడంతో వీధులన్నీ చిత్తడి చిత్తడిగా మారాయి. ఎటు చూసినా వర్షం నీరు, మురుగు నిల్వ ఉంటోంది. పట్టపగలే దోమల చెలరేగిపోతున్నాయి. దోమల నివారణ చర్యలు చేపట్టడంలో మున్సిపల్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తాయి. గత కౌన్సిల్ సమావేశాల్లోనూ వార్డుల్లో లోపించిన పారిశుధ్యంపై అధికారులను సభ్యులు నిలదీశారు. అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేయడం తప్ప అధికారులు సాధించిన పురోగతి అంటూ ఏదీ లేదు. రోజూ తాము పనిచేస్తున్నట్లుగా అపరిశుభ్రత ప్రాంతాల్లో ఫొటోలు దిగి వాటిని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడం తప్ప.. చెత్తాచెదారాన్ని తొలగించడం లేదు. మున్సిపల్ అధికారుల తీరుపై సర్వత్రా అసహనం వ్యక్తమవుతోంది.