
చదరంగంలో జిల్లా టాపర్‌గా జునైరా
గుంతకల్లు: చదరంగంలో రాపిడ్ విభాగంలో గుంతకల్లుకు చెందిన జునైరా అనే విద్యార్థిని 1,698 అత్యధిక రేటింగ్ సాధించి జిల్లా టాపర్‌గా నిలిచినట్లు కోచ్‌లు అనిల్‌కుమార్, రామారావు తెలిపారు. గత నెలలో బెంగళూరులో జరిగిన ఇంటర్ నేషనల్ రాపిడ్ ఇండిపెండెన్స్ కప్ చెస్ టోర్నీమెంట్‌లో జునైరా విజయం సాధించి రికార్డు సృష్టించినట్లు పేర్కొన్నారు. దీంతో ప్రపంచ చదరంగ సమాఖ్య, అఖిల భారత చదరంగ సమాఖ్య సంయుక్తంగా ఈ నెల ఒకటిన విడుదల చేసిన చదరంగ జాబితాలో జునైరా చోటు సంపాదించడం హర్షణీయమన్నారు. ఈ సందర్భంగా జునైరాను తల్లిదండ్రులుతోపాటు సెయింట్ పీటర్స్ స్కూల్ యాజమాన్యం, విద్యార్థులు, కోచ్‌లు అభినందిచారు.
సమగ్రశిక్ష ఐఈడీ పోస్టుకు
రీ నోటిఫికేషన్
అనంతపురం ఎడ్యుకేషన్: సమగ్రశిక్షలో ఆరు సెక్టోరియల్ అధికారుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో ఐఈడీ కోఆర్డినేటర్ పోస్టుకు ఒక అభ్యర్థి మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఆయన కూడా నాట్‌విల్లింగ్ ఇవ్వడంతో ఆ పోస్టుకు కలెక్టర్ ఆదేశాల మేరకు రీ నోటిఫికేషన్ జారీ చేస్తూ మంగళవారం సమగ్రశిక్ష ఏపీసీ శైలజ ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 6లోగా httpr://rama frarhikhaatp.bofrpot.comవెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రాథమిక కంప్యూటర్ నైపుణ్యాలు కల్గి ఉండాలని పేర్కొన్నారు. నోటిఫికేషన్ తేదీ 01–09–28 నాటికి 55 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి. క్రమశిక్షణ చర్యలు పెండింగ్ ఉన్న టీచర్లు డిప్యుటేషన్‌కు పరిగణించబడరని స్పష్టం చేశారు. సమగ్ర శిక్షలో ఐదేళ్లు నిరంతర లేదా వేర్వేరు కాలాల్లో డిప్యుటేషన్‌పై పని చేసిన వారు అనర్హులని పేర్కొన్నారు. 6వ తేదీ సాయంత్రం 5.30 గంటల తర్వాత దరఖాస్తులు స్వీకరించబడవని స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని జిల్లాలో పని చేస్తున్న ఆసక్తిగల ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్ టీచర్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
మట్టిలో చిక్కుకుని ఇద్దరు కూలీలు మృతి
యశవంతపుర: ఉపాధి కోసం కర్ణాటకకు వలస వెళ్లిన ఇద్దరు అనంతపురం జిల్లా కూలీలు పునాది తవ్వుతున్న సమయంలో మట్టిదిమ్మెలు విరిగిపడి మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి. సోమవారం సాయంత్రం కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని యలహంకలో ఎంబసీ గ్రూప్‌కు చెందిన భారీ భవన నిర్మాణం కోసం కూలీలు పునాదులు తవ్వుతున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా మట్టిదిమ్మెలు విరిగి అనంతపురం జిల్లాకు చెందిన కూలీలు శివ (35), మధుసూదనరెడ్డి (48)పై పడ్డాయి. తోటి కూలీలు మట్టిని తొలగించి వారిని బయటకు తీయగా.. అప్పటికే శివ చనిపోయాడు. మధుసూదన్‌రెడ్డిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయాడు. కొన్నిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మట్టి వదులుగా మారి విరిగిపడినట్లు కూలీలు చెబుతున్నారు. యలహంక పోలీసులు భవన యజమానిపై కేసు నమోదు చేశారు.
‘సోలార్’ ఏర్పాటును
ఉపసంహరించుకోవాలి
గుత్తి: రైతులకు తీరని నష్టం కలిగించే సోలార్ ఇండస్ట్రీ ఏర్పాటును ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. గుత్తి మండలం బేతాపల్లిలోని సోలార్ ఇండస్ట్రీని మంగళవారం ఆయన ఏపీ రైతు సంఘం నాయకులు, సీపీఎం నాయకులతో కలిసి పరిశీలించారు. సోలార్ ఇండస్ట్రీకి భూములు ఇచ్చిన రైతులతో మాట్లాడారు. అనంతరం గుత్తి ఆర్‌అండ్‌బీ బంగ్లాలో విలేకరులతో మాట్లాడారు. సోలార్ ఇండస్ట్రీ వల్ల పంట భూములు నాశనం అవుతాయన్నారు. రైతుకు ఎకరాకు రూ.30 వేలు ఇచ్చి 30 ఏళ్లు లీజుకు తీసుకుంటారన్నారు. ఎలాంటి సమస్య వచ్చినా రైతులు ఢిల్లీకి వెళ్లి గోడు చెప్పుకోవలసి వస్తుందన్నారు. బేతాపల్లిలో ఏకంగా 17 వేల ఎకరాల భూములు తీసుకున్నారన్నారు. ఆ భూములపై ఇక రైతులు ఆశలు వదులుకోవలసిందేనన్నారు. ప్రభుత్వం పునరాలోచించి సోలార్ ఇండస్ట్రీకి భూములు తీసుకోవడం ఆపేయాలన్నారు. లేకపోతే ఏపీ రైతు సంఘం, సీపీఎం ఆధ్వర్యంలో రైతులతో కలిసి భారీ ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా నాయకులు దస్తగిరి, ఈశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.