స్వచ్ఛతకు పాటుపడదాం
అనంతపురం కార్పొరేషన్: స్వచ్ఛతకు పాటుపడి, నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుకుందామని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, మేయర్ వసీం పిలుపునిచ్చారు. శనివారం ‘స్వచ్ఛ ఆంధ్ర–స్వచ్ఛ దివస్’ కార్యక్రమంలో భాగంగా స్థానిక జెడ్పీ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం నుంచి నగరపాలక సంస్థ వరకు ర్యాలీ నిర్వహించారు. నగరపాలక సంస్థ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ–వేస్ట్ కలెక్షన్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ అంబికా మాట్లాడుతూ ప్రభుత్వం నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిందన్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ ఈ ఏడాది అక్టోబర్ 2 నాటికి కంపోస్టు యార్డును మరో ప్రాంతానికి తరలిస్తామని, త్వరలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వంకల వద్ద రక్షణ గోడలను నిర్మిస్తామన్నారు. మేయర్ వసీం మాట్లాడుతూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రూ.వెయ్యికోట్లతో అభివృద్ధి పనులు జరిగాయన్నారు. ప్రధాన నగరాలను తలదన్నేలా అభివృద్ధి చేసి చూపామన్నారు. కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ మాట్లాడుతూ ఈ–వేస్ట్ సేకరణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎలక్ట్రానిక్స్ పరికరాల వాడకం అధికమైందని, వాడిన పరికరాలను మూలకు వేయకుండా ఈ– వేస్ట్ సెంటర్‌లో ఇస్తే అందులో బాగా ఉన్న పార్ట్స్‌ను వాడేందుకు వీలుగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, కమిషనర్ బాలస్వామి, డీపీఓ నాగరాజు, జెడ్పీ సీఈఓ రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


