
● జేఎన్‌టీయూఏ రెక్టార్ డాక్టర్ ఎం.విజయకుమార్
అనంతపురం: ఉద్యోగం చేయడం కంటే పది మందికి ఉపాధి కల్పించే ఉద్యోగ సృష్టికర్తలుగా ఎదగాలని విద్యార్థులకు జేఎన్‌టీయూఏ రెక్టార్ డాక్టర్ ఎం.విజయకుమార్ పిలుపునిచ్చారు. జేఎన్‌టీయూఏ కళాశాల 78వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కళాశాల ఘన చరిత్రను కొనియాడారు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఉన్నత స్థానాల్లో స్ధిరపడ్డారన్నారు. విద్యార్థులకు నచ్చిన రంగాన్ని ఎంపిక చేసుకుని అంకితభావంతో కృషి చేస్తే విజయం తథ్యమన్నారు. విద్యా ప్రణాళికలో ముఖ్యంగా క్రీడలు, ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ కార్యక్రమాలకు సైతం క్రెడిట్లు ఇచ్చినట్లు తెలిపారు. కళాశాల పురోగతికి విద్యార్థులు, అధ్యాపకులు, పూర్వ విద్యార్థుల పాత్ర కీలకమన్నారు. రిజిస్ట్రార్ డాక్టర్ సి.శశిధర్ మాట్లాడుతూ.. యువత చేతిలో దేశాభివృద్ధి ఆధారపడిందన్నారు. విద్యార్థి దశలోనే జ్ఞానంతో పాటు క్రమశిక్షణ, ఇతరులతో ఎలా మెలగాలో తెలిసినపుడే పరిపూర్ణమైన వ్యక్తిగా ఎదుగుతారన్నారు. ఈ కళాశాల విద్యార్థులు మంచి కంపెనీలు స్థాపించి, ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించిన అంశాన్ని గుర్తు చేశారు. కార్యక్రమానికి ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ అధ్యక్షత వహించారు. కళాశాలలో గతేడాది జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు, మెరిట్ సర్టిఫికెట్‌లు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఈ.అరుణకాంతి, స్పోర్ట్స్ సెక్రెటరీ జోజిరెడ్డి, డైరెక్టర్లు ప్రొఫెసర్ పీఆర్ భానుమూర్తి, ప్రొఫెసర్ డి.విష్ణువర్ధన్, ప్రొఫెసర్ ఎ.సురేష్‌బాబు, ప్రొఫెసర్ బాలనరసయ్య, ప్రొఫెసర్ ఏపీ శివకుమార్, పాలకమండలి సభ్యుడు డాక్టర్ ఎం.రామశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
