టీడీపీ నాయకుల విందులో అటెండర్‌ | Sakshi
Sakshi News home page

టీడీపీ నాయకుల విందులో అటెండర్‌

Published Sat, Apr 13 2024 12:20 AM

జేసీతో కలసి విందులో పాల్గొన్న అటెండర్‌ మాబూసాహెబ్‌ (వృత్తంలోని వ్యక్తి) - Sakshi

తాడిపత్రి రూరల్‌: స్థానిక ఇంటిగ్రెటెడ్‌ హాస్టల్‌లో అటెండర్‌గా పనిచేస్తున్న మాబూసాహెబ్‌ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారు. ఇటీవల ఆర్డీటీ కాలనీలో నివాసముంటున్న టీడీపీ నేత రమణ ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి, పలువురు టీడీపీ నాయకులతో కలసి మాబూసాహెబ్‌ పాల్గొన్నారు. ఆలస్యంగా ఈ విషయాన్ని గుర్తించిన కొందరు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

అక్రమంగా కల్లు

విక్రయిస్తున్న టీడీపీ నేత అరెస్ట్‌

కళ్యాణదుర్గం రూరల్‌: మండలంలోని బోరంపల్లిలో ఎలాంటి అనుమతులు లేకుండా కల్లు విక్రయిస్తున్న ఆ గ్రామ టీడీపీ నేత జయరాంను శుక్రవారం ఉదయం ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. 70 లీటర్ల కల్లు స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేశారు. అలాగే కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ఒంటిమిద్ది – బోరంపల్లి మార్గం మధ్యలో శుక్రవారం ఉదయం ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న 480 టెట్రా ప్యాకెట్ల కర్ణాటక మద్యాన్ని సెబ్‌ పోలీసులు సీజ్‌ చేశారు. మద్యం తరలిస్తున్న ఒంటిమిద్ది నివాసి గంగాధర్‌ను అరెస్ట్‌ చేశారు. కాగా, గంగాదర్‌పై పదుల సంఖ్యలో ఇప్పటికే అక్రమ మద్యం కేసులు ఉండడం గమనార్హం. తనిఖీల్లో సెబ్‌ సీఐ వెంకట్‌, సిబ్బంది పాల్గొన్నారు.

రూ.లక్ష నగదు సీజ్‌

అనంతపురం: ఎలాంటి ఆధారాలు లేకుండా అక్రమంగా తీసుకెళుతున్న రూ.లక్ష నగదును అనంతపురం నాల్గో పట్టణ పోలీసులు, ఎన్నికల ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు సీజ్‌ చేశారు. సీజ్‌ చేసిన నగదును అనంతపురం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి అప్పగించారు. డీఎస్పీ వీరరాఘవరెడ్డి పర్యవేక్షణలో శుక్రవారం నాల్గో పట్టణ పోలీస్‌స్టేషన్‌ సీఐ ఆర్‌. ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐ నాగమధు, సిబ్బంది రుద్రంపేట సర్వీసు రోడ్డులో వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ధర్మవరానికి చెందిన గుర్రం శివ కుమార్‌ రూ.లక్ష నగదును ఎలాంటి ఆధారాలు లేకుండా కారులో తీసుకెళ్తుండగా గుర్తించి సీజ్‌ చేశారు.

‘డ్రిప్‌’ దొంగల అరెస్ట్‌

పెద్దపప్పూరు: రైతులు భూముల్లో ఏర్పాటు చేసిన డ్రిప్‌ పరికరాలను అపహరించుకెళ్లే ఇద్దరు రెడ్‌హ్యాండెడ్‌గా పోలీసులకు పట్టుబడ్డారు. వివరాలు... పెద్దపప్పూరు మండలం తురకపల్లికి చెందిన దివాకర్‌రెడ్డి, ఖాజాపీరా (బొలెరో యజమాని) శుక్రవారం బొలెరోలో డ్రిప్‌ పైపులు తరలిస్తుండగా చెర్లోపల్లి సమీపంలో పోలీసులు ఆపి తనిఖీ చేశారు. ఆ సమయంలో ఇద్దరూ తడబడడంతో తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. చెర్లోపల్లికి చెందిన రైతులు వెంకట్రామిరెడ్డి, శివశంకరెడ్డి పొలాల్లో ఉన్న రూ.1.20 లక్షల విలువ చేసే డ్రిప్‌ పైప్‌లను చోరీ చేసి తరలిస్తున్నట్లుగా అంగీకరించారు. నిందితులను అరెస్ట్‌ చేసి, వాహనాన్ని సీజ్‌ చేసినట్లు ఎస్‌ఐ శరత్‌చంద్ర తెలిపారు.

Advertisement
Advertisement