
అడుగడుగునా ఆంక్షలు
● వైఎస్ జగన్ పర్యటనలో కేవలం మూడు చోట్ల మాత్రమే జనాన్ని అనుమతిస్తామంటున్న పోలీసులు
● ఒక్కో పాయింట్ వద్ద500 మందికి మించిఉండకూడదని నిబంధన
సాక్షి, అనకాపల్లి: కూటమి సర్కారుకు వణుకు పుట్టింది. మెడికల్ కాలేజీ అంశాన్ని మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం వికటిస్తోందని భయం పట్టుకుంది. అందుకే నర్సీపట్నంలో వైద్య కళాశాల ఏర్పాటుకు అసలు జీవోయే విడుదల కాలేదని, నిర్మాణమే జరగలేదని వాదించిన కూటమి నేతలు.. స్వయంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రంగంలోకి దిగుతుండడంతో కలవరపడుతున్నారు. మెడికల్ కాలేజీ అంశంలో అభాసుపాలవుతామన్న ఆందోళనతోపాటు జననేతను కలిసేందుకు వచ్చే జన సంద్రాన్ని చూసి పరువు పోతుందన్న బెంగ వారిని వెంటాడుతోంది. అందుకే గురువారం వైఎస్ జగన్ పర్యటనకు అడుగడుగునా ఆంక్షలు విధిస్తూ అవాంతరాలు కల్పిస్తున్నారు. తొలుత రోడ్ షో కుదరదు.. హెలిపాడ్‌కు అనుమతి కోరితే పరిశీలిస్తామన్న పోలీసు అధికారులు.. చివరకు విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి మాకవరపాలెం మండలంలోని భీమబోయినపాలెం రోడ్డు మార్గంలో వెళ్లేందుకు అనేక ఆంక్షలతో అనుమతించారు.
మూడుచోట్ల 500 మందికి మించి జనం రాకూడదు..
ఎట్టకేలకు రోడ్డు మార్గంలో వెళ్లేందుకు అనుమతించిన పోలీసులు.. కొత్త మెలికలు, కొర్రీలు పెట్టారు. భారీగా జనం తరలివస్తారని నివేదికలు ఉన్నాయని.. కార్యక్రమానికి ఎంతమంది హాజరవుతారు.. పాల్గొనే వాహనాల సంఖ్య ఎంత.. స్పష్టం చేయాలని వైఎస్సార్ సీపీ నేతలను అడుగుతున్నారు. పోలీసుల అనుమతి ప్రకారం విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి మాకవరపాలెం మెడికల్ కళాశాల వరకు పెందుర్తి, అనకాపల్లి కొత్తూరు జంక్షన్, తాళ్లపాలెం జంక్షన్ల వద్ద మాత్రమే జనం ఉండాలి. మిగిలిన చోట్ల ఎక్కడా కూడా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలవకూడదని పోలీసులు ఆంక్షలు పెడుతున్నారు. అక్కడ 500 మంది మించి జనం ఉండకూడదంటూ బెదిరిస్తున్నారు. వైఎస్ జగన్‌పై ప్రజాభిమానాన్ని నిర్వాహకులు ఎలా లెక్కకట్టి చెప్పగలుగుతారు? తమ ప్రియతమ నాయకుడికి సమస్యలు చెప్పుకునేందుకు సామాన్య ప్రజలు వచ్చి వినతి పత్రాలు ఇస్తారు.. ఆయన తీసుకుంటారు. ఇక్కడ కూడా పోలీసు ఆంక్షలేనా అంటూ సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.
పర్యటనకే అనుమతి.. ఫ్లెక్సీలకు కాదు
అనకాపల్లి నుంచి తాళ్లపాలెం వరకు జాతీయరహదారిని ఆనుకుని మాజీ సీఎం పర్యటన మార్గంలో ఫ్లెక్సీలు పెట్టవద్దని పోలీసులు బుధవారం ఓవరాక్షన్ చేశారు.
పర్యటనకే పర్మిషన్.. ఫ్లెక్సీలకు కాదంటూ వాగ్వాదం పెట్టుకున్నారు. వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు ఎదురుతిరిగి.. రోడ్డుపై ఉన్న కూటమి పార్టీల ఫ్లెక్సీలన్నీ ముందు తొలగించమని డిమాండ్ చేశారు. కూటమి పార్టీలకు ఒక న్యాయం, మాకొక న్యాయమా ఆంటూ ప్రశ్నించారు. దీంతో పోలీసులు చల్లగా జారుకున్నారు. ఇలా జిల్లాలో అనేకచోట్ల ఆటంకాలు కల్పించారు.
నేతల గృహ నిర్బంధానికి సన్నాహాలు
మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో ఈనెల 9వ తేదీన ఎవరూ వెళ్లకూడదు.. జనాన్ని తీసుకెళ్లకూడదంటూ పోలీస్‌స్టేషన్ల నుంచి వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, పార్టీ మండల అధ్యక్షులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. అనకాపల్లి టౌన్, రూరల్, కశింకోట, యలమంచిలి రూరల్, యలమంచిలి టౌన్, నర్సీపట్నం టౌన్, రూరల్, చోడవరం టౌన్ పోలీసులు వైఎస్సార్ సీపీ ద్వితీయశ్రేణి, తృతీయశ్రేణి నాయకులకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. వైఎస్సార్ సీపీ ముఖ్యనేతలు, మండల, గ్రామ స్థాయి నాయకులను హౌస్ అరెస్ట్‌లు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
భద్రతపై ఎస్పీ సమీక్ష
మాకవరపాలెం: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనలో భద్రతపై ఎస్పీ తుహిన్ సిన్హా సమీక్షించారు. మండలంలోని భీమబోయినపాలెం వద్ద గల మెడికల్ కళాశాల భవనాలను ఆయన బుధవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణానికి జగన్ కాన్వాయ్ చేరుకునే మార్గం, మీడియాతో మాట్లాడనున్న ప్రదేశాన్ని పరిశీలించారు. పర్యటన సందర్భంగా భద్రతాపరంగా ఎలాంటి లోటుపాట్లు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశాలిచ్చారు. అలాగే కళాశాల ప్రాంగణం మొత్తం డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) దేవప్రసాద్, నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు, పరవాడ డీఎస్పీ విష్ణుస్వరూప్, నర్పీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ, పలువురు ఎస్‌ఐలు పాల్గొన్నారు.