
స్పీకర్ ఒత్తిడితో కట్టడికి యత్నాలు
మాకవరపాలెం: స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఒత్తిడితో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనకు జనం రాకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేష్ ఆరోపించారు. గురువారం జరగనున్న జగన్ పర్యటన నేపథ్యంలో మెడికల్ కాలేజీ వద్ద నుంచి మాట్లాడిన వీడియోను ఉమాశంకర్‌గణేష్ బుధవారం మీడియాకు విడుదల చేశారు. ఇప్పటికే పోలీసులు వైఎస్సార్‌సీపీ నేతలకు బెదిరింపులతో పాటు నోటీసులు ఇచ్చారన్నారు. నేతలపై ఆంక్షలు విధించడమే కాకుండా కళాశాల వద్దకు జనాన్ని రాకుండా ఆటో డ్రైవర్లతో సమావేశాలు ఏర్పాటు చేసి పోలీసులు ఆదేశాలు జారీ చేశారని విమర్శించారు. వైద్య కళాశాల చుట్టూ ఉన్న దారులపై డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించారని చెప్పారు. ఈ ప్రాంత ప్రజల కోసం జగన్ వస్తున్నారని, వేలాది మందికి మేలు చేయడమే లక్ష్యంగా 630 పడకలతో మెడికల్ కళాశాలను మంజూరు చేశారని గుర్తు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ కాలేజీని ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయాలని చూడటాన్ని అందరూ వ్యతిరేకించాలన్నారు. నియోజకవర్గంలోని ప్రజలు, నాయకులు ఎన్ని ఆంక్షలు విధించినా జగన్ పర్యటనలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.