కూటమి కత్తి! | - | Sakshi
Sakshi News home page

కూటమి కత్తి!

Oct 9 2025 3:13 AM | Updated on Oct 9 2025 10:32 AM

కూటమి

కూటమి కత్తి!

2022, డిసెంబర్‌ 30న ప్రభుత్వ మెడికల్‌ కాలేజీకి శంకుస్థాపన

రూ.500 కోట్లు కేటాయించిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం

50 ఎకరాల్లో 13.21 లక్షల చ.అ. విస్తీర్ణంలో భవన నిర్మాణం

గత ప్రభుత్వ హయాంలో నిర్మాణ పనులు పరుగులు

కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ పనులకు బ్రేకులు

కాలేజీని పీపీపీ పేరుతో ప్రైవేటుకు అప్పగించాలని కుట్రలు

విశాఖ సిటీ: రాష్ట్రంలో అన్ని జిల్లాలను కలుపుతూ ఒక మెడికల్‌ సర్క్యూట్‌ను ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే గత ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పానికి కూటమి ప్రభుత్వం తూట్లు పొడిచేందుకు సిద్ధమైంది. ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఉండాలన్న గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ లక్ష్యాన్ని కాలరాసే పన్నాగాలు పన్నుతోంది. పేదలకు వైద్య విద్యతో పాటు.. అత్యాధునిక వైద్య సదుపాయాలు అందించేందుకు గతంలో శ్రీకారం చుడితే.. కూటమి ప్రభుత్వం వాటిని పీపీపీ పేరుతో ప్రైవేటుకు కట్టబెట్టేందుకు కుట్ర చేస్తోంది. పేద, బడుగు, బలహీన వర్గాలకు వైద్య విద్య, వైద్యాన్ని దూరం చేయాలని కంకణం కట్టుకుంది. 2022, డిసెంబర్‌ 30న అప్పటి సీఎం వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి నర్సీపట్నంలో మెడికల్‌ కాలేజీ పనులకు శంకుస్థాపన చేయగా.. ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఈ కళాశాల నిర్మాణాన్ని అడ్డుకోవడానికి చంద్రబాబు అండ్‌ కో విశ్వప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

అనకాపల్లిలో ఏర్పాటు చేయకుండా అడ్డంకులు

రాష్ట్రంలో కొత్తగా 17 ప్రభుత్వ వైద్య కళాశాలలకు గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం శ్రీకారం చుడితే వాటిని అడ్డుకోవడానికి చంద్రబాబు గ్యాంగ్‌ తీవ్ర ప్రయత్నాలు చేసింది. ప్రధానంగా అనకాపల్లి జిల్లాలో మెడికల్‌ కళాశాలను ఏర్పాటు చేయకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టించింది. తొలి విడతలో అనకాపల్లి టౌన్‌లో ఏర్పాటుకు 50 ఎకరాల స్థలాన్ని కేటాయించగా.. స్థానిక టీడీపీ నేతలు న్యాయస్థానాల ద్వారా అడ్డుకున్నారు. దీంతో అనకాపల్లి నుంచి నర్సీపట్నం నియోజకవర్గానికి వైద్య కళాశాలను తరలించాల్సి వచ్చింది. ఈ మెడికల్‌ కాలేజీ నిర్మాణం పూర్తయితే గ్రామీణ ప్రాంతంలో సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయి. అలాగే ఏటా 150 ఎంబీబీఎస్‌ సీట్లలో విద్యార్థులకు ప్రవేశం లభిస్తుంది. తర్వాత పీజీ వైద్య కోర్సులు వస్తాయి. తద్వారా పీజీ వైద్య విద్యార్థులు, వారికి వైద్య విద్య బోధించే ప్రొఫెసర్లు (నిపుణులైన వైద్యులు) అందుబాటులోకి వస్తారు. వారు ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి అక్కడే నివాసం ఉండాల్సి ఉంటుంది. దీంతో గ్రామీణ ప్రజలకు 24 గంటలూ అత్యవసర వైద్యం అందుతోంది. కానీ ఈ ప్రభుత్వ వైద్య కళాశాలను కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంలో ప్రైవేటుకు అప్పగించాలని నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వాటిని కౌంటర్‌ చేయలేక కిందామీదా పడుతోంది. ఇది కూటమికి ప్రతికూల ప్రభావాన్ని చూపించే అవకాశం ఉండడంతో అసలు వైద్య కాలేజీ నిర్మాణాలే జరగలేదని మంత్రులు అబద్దాలకు తెరతీశారు.

వందేళ్ల తర్వాత ప్రభుత్వ వైద్య కళాశాల

ఉత్తరాంధ్రలో 1921లో ఆంధ్రా మెడికల్‌ కాలేజీ ఏర్పాటైంది. వందేళ్ల తర్వాత గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం నర్సీపట్నం, పాడేరుల్లో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండలం భీమబోయినపాలెంలో మెడికల్‌ కాలేజీ నిర్మాణానికి రూ.500 కోట్లు కేటాయించింది. 2022, డిసెంబర్‌ 30న అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఈ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2025 నాటికి పూర్తి చేయాలనే సంకల్పంతో 50.15 ఎకరాల్లో 13.21 లక్షల చ.అ. విస్తీర్ణంలో నిర్మాణ పనులు ప్రారంభించారు. ఏటా 150 ఎంబీబీఎస్‌ సీట్ల అడ్మిషన్లు చేపట్టాలని నిర్ణయించారు. వైఎస్సార్‌ సీపీ హయాంలోనే మెడికల్‌ కాలేజీ, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, నర్సింగ్‌ కాలేజీ, ఇతర భవనాల నిర్మాణాలు జోరుగా సాగాయి. ఫుటింగ్‌ దశలో భవనాలు ఉండగా.. ఐటీడీ బ్లాక్‌, 24x7 బ్లాక్‌ స్లాబ్‌ వేయడం జరిగింది. మార్చురీ బ్లాక్‌, మెడికల్‌ గ్యాస్‌ ప్లాంట్‌, బయోమెడికల్‌ గ్యాస్‌ ప్లాంట్‌, ల్యాండరీ, ఆసుపత్రి కిచెన్‌ పనులు వేగంగా జరిగాయి. దాదాపు 50 శాతానికి పైగా నిర్మాణపనులు పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ కాలేజీ నిర్మాణాలకు బ్రేకులు పడ్డాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement