
పీజీఆర్‌ఎస్ అర్జీలు ఆన్‌లైన్ తప్పనిసరి
తుమ్మపాల:
డివిజన్, మండల స్థాయిలో కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో వచ్చిన ప్రతి అర్జీని ఆన్‌లైన్‌లో నమోదు చేసి రశీదు ఇవ్వాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పీజీఆర్‌ఎస్, రీసర్వే, ఎంఎల్‌సీసీ, ఐవీఆర్‌ఎస్, నీటి తీరువా, కోర్టు కేసులు, సివిల్ సప్లయి, స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ, ఆర్‌వోఆర్ కోర్టు, దీపం–2 పథకం రీ పేమెంటు, ఓటరు మ్యాపింగ్ వంటి అంశాలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్ అర్జీదారుడితో అధికారులు స్వయంగా మాట్లాడి సమస్యను పరిష్కరించాలన్నారు. ప్రభుత్వ భూములను సర్వే చేసి, ఆక్రమణలు గుర్తించి నోటీసులు అందజేయాలన్నారు. మండల స్థాయి సమన్వయ కమిటీకి సిఫార్సు చేసిన సివిల్ కేసులను శత శాతం పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. కుటుంబ సభ్యుల మధ్య సివిల్ తగాదాలకు సంబంధించి కౌన్సెలింగ్ ద్వారా పరిష్కారం చూపాలన్నారు. నీటి తీరువా వసూలు పెంచాలన్నారు. కోర్టు కేసులు పూర్తి చేయాలని, ప్రతి శనివారం ఆర్‌వోఆర్ కోర్టు నిర్వహించాలని సూచించారు.
మొదటి విడత రీ సర్వే పూర్తయిందని, రెండో విడత సర్వేలో వచ్చిన సమస్యలను పరిష్కరించాలన్నారు. మూడో విడత రీ సర్వే మొదలు పెట్టిన 30 గ్రామాల్లో ప్రభుత్వ భూములను గుర్తించి హద్దులు నిర్ణయించాలని, రికార్డుల శుద్ధీకరణ చేయాలని ఆదేశించారు. రేషన్ షాపులు, బియ్యం బిల్లు, పెట్రోల్ బంకులు, గ్యాస్ ఏజెన్సీలను తహసీల్దార్లు, సివిల్ సప్లయి అధికారులు తనిఖీలు నిర్వహించాలన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ శత శాతం పూర్తి చేయాలన్నారు. దీపం పథకానికి సంబంధించి నిధుల జమలో సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించాలని చెప్పారు. ఓటరు జాబితాలకు సంబంధించి వెరిఫికేషన్ పూర్తి చేసిన అనంతరం ప్రతి ఓటరును మ్యాపింగ్ చేయాలన్నారు. ఫారం 6కు సంబంధించిన దరఖాస్తులు పెండింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ ఎం.జాహ్నవి, జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు, రెవెన్యూ డిజినల్ అధికారులు వి.వి.రమణ, షేక్ ఆయిషా, జిల్లా సప్లయి అధికారి మూర్తి, సర్వే సహాయ సంచాలకుడు గోపాలరాజ, తహసీల్దార్లు పాల్గొన్నారు.