
కేజీహెచ్‌లో వద్దు.. కురుపాం వెళ్లిపోండి.!
నీరసంగా ఉన్నా.. వైఎస్ జగన్ పరామర్శించకూడదనే నెపంతోనే డిశ్చార్జ్
కేజీహెచ్‌లో మొత్తం 64 మంది చేరగా.. ఇప్పటికే 18 మంది డిశ్చార్జ్
నేటి ఉదయం మరో 10 మందిని పంపించేందుకు సన్నాహాలు
బాధిత విద్యార్థినుల ఆహారం విషయంలోనూ అదే నిర్లక్ష్యం
సాక్షి, విశాఖపట్నం : కూటమి ప్రభుత్వం అంతు లేని నిర్లక్ష్యం కారణంగా.. ఇప్పటికే ఇద్దరు విద్యార్థినుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వంద మందికి పైగా విద్యార్థినులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయినా ప్రభుత్వంలో కించిత్తు పశ్చాత్తాపం కనిపించలేదు. చికిత్స పొందుతున్న విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్య తను విస్మరిస్తోంది. వైద్యం అందించడంలోనూ రాజకీయం చేస్తోంది. విశాఖలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన ఖరారవ్వడం..పచ్చకామెర్లతో బాధపడుతున్న విద్యార్థులను పరామర్శించేందుకు వస్తున్నారని తెలుసుకున్న ప్రభుత్వం.. విద్యార్థుల ఆరోగ్యంతో ఆడుకుంటోంది. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పూర్తిగా నయమవ్వకుండానే విద్యార్థినులను కేజీహెచ్ నుంచి డిశ్చార్జ్ చేసేస్తున్నారు. బాబ్బాబూ.. పాప ఇంకా నీరసంగా ఉందయ్యా.. అని వేడుకుంటున్నా.. కేజీహెచ్‌లో వద్దు.. కురుపాం వెళ్లిపోండంటూ పంపించేస్తున్నారు.
ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా..
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలోని ఏకల వ్య పాఠశాల, దానిని ఆనుకొని ఉన్న గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహంలో విషజ్వరాలు ప్రబలి ఇద్దరు విద్యార్థినులు మృత్యు ఒడికి చేరుకున్నారు. 120 మందికి పైగా ఆస్పత్రుల పాలయ్యారు. వీరి లో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో కురుపాం, పార్వతీపురం ఆస్పత్రుల నుంచి కేజీహెచ్‌కు 64 మంది విద్యార్థులను తరలించారు. ఆ సమయంలో వీరందరి ఆరోగ్యం కూడా కాస్తా విషమంగా ఉంది. ప్రతిరోజూ వైఎస్సార్ సీపీ నేతలు పరామర్శించి.. వైద్య సహాయక చర్యలపై ఆరా తీసిన తర్వాతే... విద్యార్థులకు వైద్య సేవలు ముమ్మరం చెయ్యడం ప్రారంభించారు. దీంతో పిల్లలు ఇప్పుడిప్పుడే కాస్తా కోలుకుంటున్నారు.
వైఎస్ జగన్ వస్తున్నారని..!
కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థినులను గురువారం సాయంత్రం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శిస్తారని తెలిసినప్పటి నుంచి కూటమి ప్రభుత్వానికి భయం పట్టుకుంది. కురుపాం ఘటనను బాహ్య ప్రపంచానికి తెలియకుండా మాఫీ చేసేందుకు ప్రభుత్వం యత్నించినా బట్టబయలైంది. ఇక వైఎస్ జగన్ వస్తే.. జాతీయ స్థాయి ఇష్యూగా మారుతుందనే ఆందోళన ప్రభుత్వంలో కనిపించింది. దీంతో విద్యార్థినుల ఆరోగ్యంతో చెలగాటమాడేందుకు కూడా వెనుకాడటం లేదు. హోంమంత్రి, ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో నీరసంగా ఉన్నా కనికరించకుండా విద్యార్థినులను కేజీహెచ్ నుంచి డిశ్చార్జ్ చేయ డం మొదలుపెట్టారు. మంగళవారం రాత్రి 8 మందిని, బుధవారం రాత్రి ఆదరాబాదరాగా మరో 10 మందిని పంపించేశారు. శుక్రవారం ఉదయంలోపు మరో 10 మందిని పంపించేందుకు డిశ్చార్జ్ షీట్స్ సిద్ధం చేస్తున్నారు. పాప నీరసంతో నడవలేకపోతోంది.. రెండు రోజులు ఇక్కడ ఉంచాలని తల్లిదండ్రులు కోరుతున్నా.. ఏం ఫర్వాలేదు.. మీరు కురు పాం పీహెచ్‌సీలో జాయిన్ అవ్వండంటూ డిశ్చార్జ్ షీట్‌లో రాసి మరీ పంపించేస్తుండటం దారుణం.
ఆహారం విషయంలోనూ..
బాధిత విద్యార్థినుల ఆహారం విషయంలోనూ అదే నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారు. పచ్చకామెర్లతో బాధపడుతున్న వారికి తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం ఇవ్వాలి. కానీ కేజీహెచ్‌లో ప్రతిరోజూ అందరికీ అందించే ఉప్మా ఇచ్చారు. హోం మంత్రి అనిత పరామర్శించిన సమయంలో బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో.. తర్వాత నుంచి ప్రత్యేక మెనూ ఇస్తున్నారు. మొత్తానికి తమ రాజకీయం కోసం.. విద్యార్థుల ఆరోగ్యాన్ని కూడా కూటమి ప్రభుత్వం లెక్కచేయకపోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.