
పెందుర్తి జంక్షన్ వద్ద జననేతకు స్వాగతం పలుకుతున్న అశేష జనవాహిని
విశాఖ ఎయిర్‌పోర్ట్ నుంచి పెందుర్తి, అనకాపల్లి మీదుగా పర్యటన
జనజాతరతో హోరెత్తిన ఉమ్మడి విశాఖ జిల్లా
కూటమి ప్రభుత్వం అడ్డంకులు సృష్టించినా వెరవని ప్రజలు
రోప్‌పార్టీలు, చెక్‌పోస్టులు దాటుకొని జగన్‌తో కరచాలనం చేసేందుకు పోటీ
భారీ వర్షంలోను హుషారుగా సాగిన జగన్ పర్యటన
ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణ పనుల పరిశీలన
అనంతరం కేజీహెచ్‌లో కురుపాం గిరిజన బాలికలకు పరామర్శ
మండుటెండలోనూ అడుగు వెనక్కిపడలేదు. అడ్డంకులు సృష్టించినా జన సునామీ చేతులెత్తి మొక్కుతూ.. మనసారా అభివాదం చేస్తూ.. ముందుకు సాగిన మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆకాశం చిల్లుపడేలా వర్షం పడినా వెరవలేదు. అదే అభిమానం.. చెక్కు చెదరని ఆదరణ. విశాఖ పర్యటనకు వచ్చిన జననేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు అడుగడుగునా హారతులు పట్టారు. ప్రతి జంక్షన్‌లోను పూల వర్షం కురిపించారు. గజమాలలతో స్వాగతాలు పలికారు. విశాఖ ఎయిర్‌పోర్ట్ నుంచి మాకవరపాలెం మెడికల్ కాలేజీ వరకు సాగిన ఈ పర్యటనలో బ్రహ్మరథం పట్టారు. ఈ పర్యటనకు జనాలు రాకుండా చేసేందుకు కూటమి ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినావాటన్నింటినీ పటాపంచలు చేశారు. బారికేడ్లు, రోప్ పార్టీలు, చెక్‌పోస్టులు జనహోరు ముందు నిలవలేకపోయాయి. జంక్షన్లు జనజాతరను తలపించాయి. మార్గంమధ్యలో బాధలు, సమస్యలతో వచ్చిన వారి నుంచి వినతులు స్వీకరిస్తూ.. వారికి భరోసా ఇస్తూ.. సుమారు 60 కిలోమీటర్ల మేర అభిమానంతో వచ్చిన ప్రతి ఒక్కరికీ అభివాదాలు చేస్తూ.. జనసునామీలో ముందుకు సాగారు. అభిమాన నేతకు కరచాలనం చేసేందుకు మహిళలు, వృద్ధులు, యువత పోటీ పడ్డారు. సాధారణంగా 60 కిలోమీటర్ల ప్రయాణానికి గంటన్నర సమయం పడుతుంది. కానీ విశాఖను చుట్టేసిన జన సంద్రాన్ని తన చిరునవ్వుతో పలకరిస్తూ సాగిన ఆయన పర్యటనకు 6 గంటలు పట్టిందంటే ప్రజానీకం ఎలా వెల్లువలా వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. – విశాఖ సిటీ
నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలను పీపీపీ విధానంలో ప్రైవేటుపరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోంది. ఇందులో భాగంగానే అసలు మెడికల్ కాలేజీల నిర్మాణాలే జరగలేదని, మాకవరపాలెంలో నిర్మాణంలో ఉన్న కాలేజీకి జీవో ఉంటే చూపించాలని మంత్రులు సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నర్సీపట్నం మెడికల్ కాలేజీ నిర్మాణాలను పరిశీలించడానికి గురువారం విశాఖకు వచ్చారు. జగన్ పర్యటనకు భారీగా జనసందోహం తరలివస్తుండడంతో కూటమి ప్రభుత్వానికి కంటగింపుగా మారింది. దీంతో ముందు ఆయన రోడ్‌షోకు అనుమతి లేదని పోలీసులతో చెప్పించింది. ఎన్ని అడ్డంకులు సృష్టించిన రోడ్‌షో ఆగేది లేదని వైఎస్సార్‌సీపీ నేతలు తెగేసి చెప్పడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. జగన్ రోడ్‌షో చేస్తే జనసునామీ తప్పదని భావించిన చంద్రబాబు ప్రభుత్వం రాత్రికి రాత్రి షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేసింది. పోలీసుల సాయంతో ఆటోలు, ప్రైవేటు వాహన యజమానులతో సమావేశాలు పెట్టించి.. జగన్ కార్యక్రమానికి జనాలను తీసుకువెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేయించింది. అలాగే వైఎస్సార్‌సీపీ నేతలకు ఫోన్లు చేయించి జన సమీకరణ చేయకూడదని బెదిరించే ప్రయత్నం చేసింది. గురువారం తెల్లవారుజాము నుంచే రోడ్లపై బారికేడ్లు, రోప్ పార్టీలు దర్శనమిచ్చాయి. గ్రామాల్లో చెక్‌పోస్టులు వెలిశాయి.
● ప్రధానంగా విశాఖ ఎయిర్‌పోర్టు వద్ద మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి స్వాగతం పలికేందుకు వేల మంది జనాలు వస్తారని భావించిన పోలీసులు ఎన్‌ఎస్‌టీఎల్ గేటు ఎదురుగా బలగాలను మోహరించారు. ఆటోలు, ప్రైవేటు వాహనాల్లో గ్రూపులుగా విమానాశ్రయం రహదారిలోకి వెళ్లకుండా నిరోధించే ప్రయత్నం చేశారు. ఎయిర్‌పోర్టు రహదారి ప్రారంభంలో కూడా పోలీసులు వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులను అడ్డుకున్నారు.
● ఎయిర్‌పోర్టు నుంచి మాజీ సీఎం జగన్ కాన్వాయ్ బయలుదేరిన తర్వాత ఎన్‌ఏడీ కొత్త రోడ్డు వద్ద వెనుక ఉన్న వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకుల వాహనాలను అడ్డగించారు. కేవలం పోలీస్ ఎస్కార్ట్‌తోనే జగన్ కాన్వాయ్‌ను అనుమతించారు.
● గోపాలపట్నం, సింహాచలం ముఖద్వారం, వేపకుండా కూడలి, పెందుర్తి– అనకాపల్లి ప్లైఓవర్ బ్రిడ్జి ప్రాంతాల్లోను పోలీసులు ఇదే తరహా ధోరణిని అవలంబించారు.
● పోలీసులు కాన్వాయ్‌లోని వాహనాలను అడ్డుకున్న ప్రతిసారి.. నిమిషాల వ్యధిలో రెట్టించిన ఉత్సాహంతో పార్టీ శ్రేణుల వాహనాలు ఎక్కడకక్కడ కాన్వాయ్‌లో వచ్చి చేరాయి.
● పెందుర్తి హైవేపైనా అడ్డుకోగా పినగాడి, సబ్బవరం, అనకాపల్లి ఇలా.. పార్టీ శ్రేణుల వాహనాలు కాన్వాయ్‌లో కలుస్తూ పర్యటనకు మరింత ఊపు తెచ్చారు.
● అనకాపల్లి మండలం మార్టూరు జంక్షన్ వద్ద వాహనదారులను సైతం ఎక్కడకు వెళుతున్నారో తెలుసుకున్న తర్వాతే పంపించారు. కొత్తూరు జంక్షన్ వద్ద జగన్‌ను చూసేందుకు వెళుతున్న జనాలను పోలీసులు అడ్డగించారు.
● కశింకోట మండలం నర్సింగపల్లి వద్ద ఆటోల్లో ప్రయాణికులను వెళ్లనీయలేదు. అత్యవసర పనులపై వెళుతున్నట్లు ఆధారాలు చూపిస్తే గానీ ఆటోల్లో ప్రయాణికులను ముందుకు కదలనీయలేదు.
● యలమంచిలి ఫ్లై ఓవర్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. షేకిళ్లపాలెం హైవేలో సైతం ద్విచక్ర వాహనదారులను వెళ్లకుండా అడ్డుకున్నారు.
● నర్సీపట్నం నియోజకవర్గంలో ఇతర గ్రామాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సుల్లో పోలీసులు ఎక్కి మరీ ప్రయాణికులు ఎక్కడకు వెళుతున్నారని ఆరా తీసి పంపించారు.
కష్టాలు వింటూ.. వినతులు స్వీకరిస్తూ..
● మాజీ సీఎం జగన్ పర్యటనలో ప్రజలు, గ్రామస్తులు తమ కష్టాలు, సమస్యలను విన్నవించుకునేందుకు పోటీ పడ్డారు. ప్రతి ఒక్కరి బాధలను వింటూ భరోసా ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తుందని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
● ఎయిర్‌పోర్టు దాటిన తరువాత కాకానినగర్ వద్ద వైఎస్సార్ సీపీ గాజువాక సమన్వయకర్త దేవన్‌రెడ్డి ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులు మంత్రి రాజశేఖర్, అయోధ్యరామయ్యతో పాటు పలువురు జగన్‌ను కలిశారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ, కార్మికుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోవడమే వైఎస్సార్‌సీపీ లక్ష్యమని, కార్మికులకు అండగా ఉంటామని జగన్ హామీ ఇచ్చి ముందుకు కదిలారు.
● బి.భీమవరంలో బల్క్ డ్రగ్ పార్క్ బాధిత నిర్వాసితులు కలిశారు. ఆ పార్క్ వల్ల జరిగే నష్టాలను వివరిస్తూ వినతిపత్రం అందజేశారు. వారి కష్టాలను తెలుసుకున్న జగన్.. బాధితులు తీసుకొచ్చిన ప్లకార్డును పట్టుకుని వారికి మద్దతు తెలిపారు.
● గోవాడ షుగర్ ఫ్యాక్టరీని కాపాడాలని రైతులు, కార్మికులు జగన్‌ను కోరారు.
● తాళ్లపాలెం జంక్షన్ వద్ద ఎన్‌ఏవోబీ నిర్వాసితులు వినతిపత్రం అందజేశారు.
● ఇలా అనేక ప్రాంతాల్లో స్థానిక సమస్యలు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై జగన్‌కు వినతిపత్రాలు అందజేశారు.
పాల్గొన్నది వీరే..
శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, ఎంపీలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, తనూజరాణి, పార్టీ విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లా అధ్యక్షులు కేకే రాజు, అమర్‌నాథ్, మజ్జి శ్రీనివాసరావు, మాజీ డిప్యూటీ సీఎంలు బూడి ముత్యాలనాయుడు, పీడిక రాజన్నదొర, పుష్పశ్రీవాణి, ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రులు విడదల రజినీ, పేర్ని నాని, దాడిశెట్టి రాజా, సిదిరి అప్పలరాజు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎమ్మెల్యేలు మత్స్యరాస విశ్వేశ్వరరాజు, రేగం మత్స్యలింగం, జెడ్పీ చైర్‌పర్సన్ జె.సుభద్ర, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, పార్టీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్, పార్లమెంట్ పరిశీలకులు సూర్యనారాయణరాజు, కదిరి బాబురావు, శోభాహైమావతి, మాజీ ఎమ్మెల్యేలు పెట్ల ఉమాశంకర్ గణేష్, వాసుపల్లి గణేష్‌కుమార్, కరణం ధర్మశ్రీ, కంబాల జోగులు, మళ్ల విజయప్రసాద్, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, కె.భాగ్యలక్ష్మీ, మాజీ ఎంపీలు భీశెట్టి వెంకట సత్యవతి, గొడ్డేటి మాధవి, సమన్వయకర్తలు మలసాల భరత్‌కుమార్, మొల్లి అప్పారావు, దేవన్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శిలు చింతకాయల సన్యాసిపాత్రుడు, చిక్కాల రామారావు, వీసం రామకృష్ణ, పైలా శ్రీనివాసరావు, దంతులూరి దిలీప్‌కుమార్, ఉత్తరాంధ్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ, సినీనటుడు జోగినాయుడు, ముఖ్యనేతలు డాక్టర్ లక్ష్మీకాంత్, ఎర్రాపాత్రుడు, మున్సిపల్ చైర్మన్ బోడపాటి సుబ్బలక్ష్మీ, వైఎస్ చైర్మన్ కొనేటి రామకృష్ణ, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి చింతకాయల వరుణ్, మాకవరపాలెం ఎంపీపీ రుత్తల సర్వేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షుడు చిటికెల రమణ, జెడ్పీటీసీ పెట్ల సత్యవేణి తదితరులు పాల్గొన్నారు.

మీడియాతో మాట్లాడుతున్న మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి

మెడికల్ కాలేజీ దగ్గర ప్రజలను నిలువరించేందుకు ఇనుప కంచె వేసిన పోలీసులు

అభిమాన నేతకు హారతిస్తూ..

గోపాలపట్నం వద్ద కార్యకర్తలు, నేతలను అడ్డుకుంటున్న పోలీసులు

అదిగదిగో జగనన్న

బల్క్ డ్రగ్ వద్దు అనే ఫ్లకార్డును ప్రదర్శిస్తూ..

ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యుల నుంచి వినతిపత్రం స్వీకరిస్తున్న మాజీ సీఎం జగన్